- భూములు కాపాడాలని కాలనీవాసుల ఆందోళన
మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల డివిజన్-12 పరిధిలోని జయప్రద కాలనీలో సొసైటీ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ కాలనీవాసులు ఆదివారం నిరసన చేపట్టారు. సర్వే నంబర్ 130లో ఉన్న కాలనీ సొసైటీ స్థలం, గుడి, షాపింగ్ కాంప్లెక్స్, వాటర్ ట్యాంక్, స్కూల్, లైబ్రరీ స్థలాలను కాలనీ ప్రెసిడెంట్ చిగుళ్ల మహేందర్ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఇదే స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించాలంటూ మహేందర్, ఆయన తండ్రి బీఆర్ఎస్ నాయకుడు అమాలి శ్రీను స్వయంగా హైడ్రా అధికారులను ఆశ్రయించారని తెలిపారు. అధికారులు స్థలాన్ని రక్షణ పరిధిలోకి తీసుకుని నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే ఇప్పుడు అదే మహేందర్ 1200 గజాల సొసైటీ స్థలాన్ని ఆక్రమించి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, హైడ్రా బోర్డులను కూడా తొలగించారని ఆరోపించారు.
ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయ పలుకుబడితో బెదిరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రస్తుత కాలనీ అసోసియేషన్‌ను రద్దు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
