‘నో ముస్లిం స్టాఫ్’.. చెన్నైలో బేకరీ యజమాని అరెస్ట్

‘నో ముస్లిం స్టాఫ్’.. చెన్నైలో బేకరీ యజమాని అరెస్ట్

ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ఘటన తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో ముస్లింలు నిర్వహించే లేదా వారు పనిచేసే దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ కొంద‌రు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ బేకరీ షాపు యజమాని ముస్లింలను కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట‌య్యాడు.

చెన్నైలోని టీ నగర్ లో జైన్ బేకరీస్ అండ్ కన్ఫెక్షనరీస్ పేరుతో బేకరీ షాపు నిర్వ‌హిస్తోన్న ఓ వ్య‌క్తి తమ షాపులోని తినుబండారాలన్నీ జైన మతస్థులు మాత్రమే తయారు చేసినవని, తమ వద్ద ముస్లింలు ఎవరూ పనిచేయడం లేదంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను ‘వాట్సాప్’ ద్వారా తమ వినియోగదారులకు షేర్ చేశాడు. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సదరు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.