ప్రొఫెషనల్స్‌‌కు పెరిగిన జాబ్ ఆఫర్స్‌‌..

ప్రొఫెషనల్స్‌‌కు పెరిగిన జాబ్ ఆఫర్స్‌‌..


ట్యాలెంట్‌ ఉన్నవారిని నిలుపుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్న కంపెనీలు
    రిమోట్ వర్కింగ్ విధానంతో మార్కెట్‌‌‌‌లో పెరిగిన హైరింగ్‌‌
    ఐటీ సెక్టార్​లోనే ఎక్కువ..

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌, వెలుగు: చెన్నైలోని  స్టార్టప్‌‌ కంపెనీ కిస్‌‌ఫ్లో ఆఫీస్‌‌ అది..బయట  రూ. కోటి విలువ చేసే బీఎండబ్ల్యూ కార్లు..ఆశ్చర్యంలో కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లు. కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లకు రూ. కోట్లు విలువ చేసే కార్లను ఇచ్చి కిస్‌‌ఫ్లో ఫౌండర్ సురేష్ సంబంధం అందరిని ఆశ్చర్యపరిచారు. మరో స్టార్టప్ కంపెనీ ఐడియాస్‌‌2ఐటీ  తన టాప్ ఎగ్జిక్యూటివ్‌‌ల కోసం 100 మారుతి కార్లను ఆఫర్ చేసింది. ఇలా చాలా కంపెనీలు తమ  ఉద్యోగులను నిలుపుకోవడానికి లగ్జరీ కార్ల నుంచి అదనంగా బోనస్‌‌లు, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌‌ను ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌‌‌‌లోని కంపెనీలు ఉద్యోగుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి వెనకడుగువేయడం లేదు. పదేళ్ల కిందట చూస్తే రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా కంపెనీలు పెద్దగా గిఫ్ట్స్ ఇచ్చేవి కావు.  మార్కెట్‌‌లో ఇప్పుడు ట్యాలెంట్‌‌కు కొరత ఉండడం, పెరుగుతున్న అట్రిషన్ రేటు (రాజీనామాలు),  కరోనా సంక్షోభం తర్వాత హైబ్రిడ్ వర్క్‌‌ విధానం పెరుగుతుండటంతో తమ  టాప్ ఉద్యోగులను నిలుపుకోవడానికి కంపెనీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. 

ఉద్యోగులు మానేస్తుండడంతో ఇలా (బీఎండబ్ల్యూ కార్లను ఇవ్వడం) చేయాలనుకున్నామని, వారి లాయల్టీని గుర్తించాలని అనుకున్నామని  కిస్‌‌ఫ్లో  ఫౌండర్ సురేష్ సంబంధం అన్నారు. లాయల్‌‌గా ఉండడం వలన లాభాలుంటాయనే ఆలోచనను ప్రజలు నమ్మేలా చేయాలనుకున్నామని చెప్పారు. తమ టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లకు మారుతి కార్లను ఇచ్చిన ఐడియాస్‌‌2ఐటీ, సంపదను  ఉద్యోగులతో షేర్ చేసుకుంటున్నామని పేర్కొంది. ఉద్యోగుల వెయిట్‌‌ (బాడీ మాస్‌‌ ఇండెక్స్‌‌) తగ్గించుకుంటే అదనంగా బోనస్‌‌లను ఇస్తామని ఆన్‌‌లైన్ ట్రేడింగ్ కంపెనీ జెరోధా తమ ఉద్యోగులకు ఆఫర్ చేసింది.  ఉద్యోగుల హెల్త్‌‌ను మెరుగుపరచడానికి  ఈ బోనస్‌‌ ప్రకటన చేశామని కంపెనీ సీఈఓ నితిన్ కామత్‌‌ క్లారిఫై చేశారు. ఇలా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను నిలుపుకోవడానికి అనేక బెనిఫిట్స్‌‌ను ఆఫర్ చేయడం స్టార్ట్‌‌ చేస్తున్నాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. కరోనా సంక్షోభం తర్వాత  రిమోట్‌‌ వర్కింగ్ విధానం పెరుగుతోంది. దీంతో ఎక్కడో ఉన్న కంపెనీలు కూడా లోకల్‌‌గా ఉద్యోగులను హైర్ చేసుకుంటున్నాయి. దీంతో మార్కెట్ ట్యాలెంట్ ఉన్న వారి కొరత ఎక్కువవుతోంది.  తాజాగా ట్యాలెంట్‌‌500 చేసిన సర్వే ప్రకారం, దేశంలోని టాప్ మెట్రోసిటీలలోని 87 శాతం మంది ప్రొఫెషనల్స్‌‌కు కొత్త జాబ్‌‌ ఆఫర్స్ వచ్చాయి. ఈ సర్వేలో మొత్తం 4,80‌‌‌‌0 మంది ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. 88 శాతం మంది హైబ్రిడ్‌‌ వర్క్‌‌ లేదా రిమోట్ వర్క్‌‌ విధానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.  గ్లోబల్‌‌ కంపెనీలకు ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌‌గా పనిచేయడానికి రెడీ అని 63 శాతం చెప్పారని ట్యాలెంట్‌‌500 సర్వే వెల్లడించింది.