కారు డ్రైవర్‌ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ.. అతను ఏం చేశాడంటే?

కారు డ్రైవర్‌ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ.. అతను ఏం చేశాడంటే?

బ్యాంకు అధికారులు రూటే సపరేటు. నిజమే కదా! అవసరం ఉన్నోడికి డబ్బు అప్పివ్వు అయ్యా! అంటే ఇవ్వరు. పోపో.. అంటూ బయటకు దొబ్బేస్తారు. అదే అధికారం ఉన్నోళ్లకి.. ఆస్తులు ఉన్నవారికి పిలిచి మరీ రారాయ్ అంటూ అప్పులిస్తారు. అంతేకాదు ఇటీవల కాలంలో బ్యాంకు అధికారులు.. ఇతరుల ఖాతాల్లో డబ్బులు వేయటం పరిపాటి అయిపోయింది. ఇలానే పదిరోజుల కిందట ఓ కారు డ్రైవర్‌ బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమచేశారు. ఆ తరువాత ఏమయ్యింది అంటారా! అతన్ని బుజ్జగించి, బతిమలాడి తిరిగి ఆ డబ్బును తీసేసుకున్నారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

చెన్నై, కోడంబాక్కం పరిధిలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబరు 9న అతని బ్యాంకు ఖాతాలో రూ.9,000 కోట్లు డిపాజిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. మొదట అన్ని సున్నాలు చూసి.. ఇదేదో స్కాం అనుకొని మిన్నకుండి పోయాడు. కాసేపటి అనంతరం నిజమో కాదో తెలుసుకునేందుకు తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేసి చూడగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక అతని ఆనందానికి అంతులేదు. ఎగిరి గంతేశాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.

మరుసటి రోజు ఉదయాన్నే తూత్తుకుడి బ్యాంకు అధికారులు జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. రాజ్‌కుమార్ ను కనిపెట్టారు. వెంటనే అతనికి ఫోన్ చేసి పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని, తాను ఎవరికైతే పంపారో ఆ డబ్బుతో పాటూ మొత్తం సొమ్మును తమకు అప్పగించాలని హెచ్చరించారు. అనంతరం రాజ్‌కుమార్ న్యాయవాదులను సంప్రదించగా.. వారు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడటంతో కథ సుఖాంతం అయ్యింది.  

స్నేహితునికి పంపిన రూ.21 వేలు వెనక్కు ఇవ్వాల్సిన పనిలేదని, పైగా సొంతంగా కారు కొనుగోలు చేయడానికి అవసరమైన రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. చూశారుగా.. మన కథనంలో ఎంత నిజాయితీ పరుడో. అదే మీ ఖాతాలో పడితే.. రాత్రికి రాత్రే దేశం వదిలి విదేశాలకు వెళ్ళిపోరు. అంతేకదా!