క్యాబ్ డ్రైవర్ అకౌంట్ లో రూ.9 వేల కోట్లు.. ఆ 30 నిమిషాల్లో ఏం జరిగిందంటే..!

క్యాబ్ డ్రైవర్ అకౌంట్ లో రూ.9 వేల కోట్లు.. ఆ 30 నిమిషాల్లో ఏం జరిగిందంటే..!

అతని పేరు రాజ్ కుమార్.. తమిళనాడు రాష్ట్రం పలని ప్రాంతానికి చెందిన యువకుడు. చెన్నై సిటీలోని కోడంబాకం ఏరియాలో ఓ రూంలో అద్దెకు ఉంటూ.. క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తు్న్నాడు. రాజ్ కుమార్ కు తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఇదంతా ఓకే.. 2023, సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఘటన మాత్రం సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంలో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాబ్ డ్రైవర్ రాజ్ కుమార్ కు బ్యాంక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. పరిశీలించి చూస్తే చాలా సున్నాలు ఉన్నాయి.. పది నిమిషాలు కష్టపడి చెక్ చేస్తే.. అప్పుడు అర్థం అయ్యింది.. తన బ్యాంక్ అకౌంట్ లో 9 వేల కోట్ల రూపాయలు డబ్బులు పడ్డాయని..  బ్యాంక్ మెసేజ్ వచ్చిన తర్వాత 10 నిమిషాల కాదు.. 20 నిమిషాల వరకు ఆ 9 వేల కోట్ల రూపాయలు అలాగే ఉన్నాయి.. కలలో కూడా ఊహించని డబ్బులు అకౌంట్ లో ఉండటంతో.. వెంటనే తాను క్యాబ్ కిస్తీగా కట్టాల్సిన 21 వేల రూపాయలను బదిలీ చేశాడు. చక్కగా.. 21 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. డబ్బులు ఎవరు వేస్తే ఏంటీ.. అకౌంట్ ఉన్నాయి కదా అని.. మిగతా అప్పులు కూడా తీర్చటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సరిగ్గా 30 నిమిషాల తర్వాత ఖాతాలోని డబ్బులు మొత్తం వెనక్కి వెళ్లిపోయాయి. ఇక్కడ విశేషం ఏంటంటే..  అప్పటి వరకు తన ఖాతాలో ఉన్న 105 రూపాయలు కూడా మాయం అయ్యాయి. జీరో బ్యాలెన్స్ చూపించింది. 105 రూపాయలు పోతేపోయాయి.. 21 వేల రూపాయల క్యాబ్ కిస్తీ అయితే కట్టాను కదా అని లైట్ తీసుకుని.. తన పని తాను చేసుకుంటున్నాడు రాజ్ కుమార్.

 Also Read: మెడికల్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్ చేయొచ్చు

ఆ తర్వాత రోజు అంటే.. సెప్టెంబర్ 10వ తేదీ బ్యాంక్ అధికారులు రాజ్ కుమార్ గదికి వచ్చారు. నిన్న జరిగిన పొరపాటును చెప్పి.. 21 వేల రూపాయలు తిరిగి ఇవ్వాలని కోరారు. తన దగ్గర లేవని.. బ్యాంక్ అధికారుల తప్పుకు.. నేను ఎలా బాధ్యత వహిస్తానంటూ వివరణ ఇచ్చాడు. డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానంటూ చెప్పాడు. అయితే బ్యాంక్ అధికారులు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై రాజ్ కుమార్ సైతం తన లాయర్ తో పోలీసుల దగ్గరకు వెళ్లాడు. రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత.. బ్యాంక్ అధికారులు తప్పును అంగీకరించి.. 21 వేల రూపాయలు తిరిగి ఇవ్వొద్దని.. అవసరం అయితే కారు లోన్ ఇస్తామంటూ ఆఫర్ చేశారు. పూర్తిగా బ్యాంక్ అధికారుల తప్పు కావటంతో.. కోర్టు వరకు వెళితే ఉద్యోగాలకు ముప్పు వస్తుందనే భయంతోనే.. బ్యాంక్ అధికారులు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నాడు క్యాబ్ డ్రైవర్ రాజ్ కుమార్..

10 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. ఇప్పుడు చెన్నై సిటీలో హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి 30 నిమిషాలకు.. 9 వేల కోట్లకు అధిపతి అయిన క్యాబ్ డ్రైవర్ అంటూ ఫుల్ పబ్లిసిటీ కూడా వచ్చేసింది మనోడికి.. బ్యాంక్ అధికారుల తప్పు.. రాజ్ కుమార్ తెలివి.. మొత్తానికి 21 వేల రూపాయలు అయితే సేవ్ అయ్యాయి..