రేషన్​ దుకాణాల్లో కిలో టమాటా రూ.60కే

రేషన్​ దుకాణాల్లో కిలో టమాటా రూ.60కే

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని రేషన్​ దుకాణాల్లో కిలో టమాటా రూ.60కే అందుబాటులోకి తెచ్చింది. చెన్నైలోని 82 చౌకధరల దుకాణాల్లో మంగళవారం నుంచి కిలో టమాటా రూ.60కి అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి కేఆర్​ పెరియకరుప్పన్‌‌ ప్రకటించారు. చెన్నైలో ఫామ్​ ఫ్రెష్​ ఔట్​లెట్స్, కొయంబత్తూర్, సేలం, వెల్లూర్​లో కిలో టమాటా రూ.60కి విక్రయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

తొలి దశలో ఒక కుటుంబానికి రోజుకు ఒక కిలో టమాటా చొప్పున మాత్రమే అమ్ముతున్నట్లు కో ఆపరేటివ్​ డిపార్ట్​మెంట్​ అధికారి వెల్లడించారు. నార్త్​ చెన్నైలోని 32 దుకాణాల్లో, చెన్నై సెంట్రల్ లో 25,  సౌత్​ చెన్నైలోని 25 ఎఫ్ పీ షాపుల్లో టమాటాలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. కాగా, కొయంబేడు హోల్​సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.110కి విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. టమాటాలతోపాటు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ధరలు కూడా భారీగా పెరిగాయి. వీటిని కిలో రూ.150 నుంచి రూ.200కు  అమ్ముతున్నట్లు వ్యాపారులు చెప్పారు.