మూడు సార్లు ట్రాన్స్‌ప్లాంట్.. ఐదు కిడ్నీలతో చెన్నై వ్యక్తి

మూడు సార్లు ట్రాన్స్‌ప్లాంట్.. ఐదు కిడ్నీలతో చెన్నై వ్యక్తి

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో 41 ఏండ్ల వ్యక్తి శరీరంలో ఐదు కిడ్నీలతో బతుకుతున్నాడు. అదేంటి మనిషికి ఉండేది రెండు కిడ్నీలే కదా అనుకుంటున్నారా? ఐదు కిడ్నీలు ఉండడం ఎలా సాధ్యమని షాక్ అవుతున్నారా? ఆ కిడ్నీలన్నీ అతడికి పుట్టుకతో వచ్చినవి కాదు. అతడికి కూడా రెండే కిడ్నీలు ఉండేవి. చిన్న వయసులోనే ఒక కిడ్నీ ఫెయిల్ కావడంతో ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేశారు. కానీ ఆ సమయంలో కొన్ని సమస్యల వల్ల పాత కిడ్నీని తొలగించలేదు. అయితే ఆ తర్వాత మళ్లీ మళ్లీ కిడ్నీ ఫెయిల్ కావడంతో మూడు సార్లు ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు జరిగాయి. చివరికి ఇప్పుడు ఐదు కిడ్నీలతో బతుకుతున్నాడు. చెన్నైలోని ఎంఎంఎం హాస్పిటల్‌లో ఇటీవల మూడో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. ఆ వ్యక్తి ప్రస్తుతం కోలుకుని ఫస్ట్ చెకప్‌కు వచ్చాడని, అంతా సక్రమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

ఐదు కిడ్నీలతో ఉన్న ఈ వ్యక్తికి 12 ఏండ్ల వయసులో ఒక కిడ్నీ ఫెయిల్ అయింది. దీంతో తొలిసారి అతడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగింది. కానీ ఆ సర్జరీ ఫెయిల్ అయింది. దీంతో కొన్నాళ్ల తర్వాత మరోసారి ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేశారు. కానీ ఆ సమయంలోనూ బీపీ కంట్రోల్ కాకపోవడంతో సర్జరీ సక్సెస్ కాలేదు. అయితే ఆపరేషన్ చేసిన ఏ ఒక్కసారి కూడా పాత కిడ్నీని డాక్టర్లు తొలగించలేదు. పాత వాటిని తొలగించే క్రమంలో బ్లీడింగ్ కంట్రోల్ చేసి అతడిని కాపాడడం కష్టమని, ప్రాణానికే ప్రమాదం వచ్చి ఉండేదని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించ ఉన్న అతడికి మూడు సార్లు బైపాస్ సర్జరీలు కూడా జరిగాయని డాక్టర్లు చెప్పారు. 

అయితే కొద్ది రోజులుగా డయాలసిస్‌పై నెట్టుకొస్తున్న అతడికి మూడు పాత కిడ్నీలు తొలగించి, మంచిగా మరో కిడ్నీ అమర్చాలని అనుకున్నారు. ఎంఎంఎం ఆస్పత్రిలో జులై 10న ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ శరవణన్ చెప్పారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, పాత వాటిని తొలగిస్తే అతడు మరణించే ప్రమాదం ఉందని తేలడంతో వాటిని అలానే ఉంచి మరో కిడ్నీని అమర్చామని తెలిపారు. ఈసారి సర్జరీ మాత్రం విజయవంతం అయిందని చెప్పారు. ఇటీవలే పోస్ట్ ఆపరేటివ్ చెకప్‌ కోసం ఆస్పత్రికి వచ్చాడని, అతడు పూర్తిగా కోలుకున్నాడని శరవణన్ తెలిపారు.