మహిళా కానిస్టేబుల్ను కత్తితో పొడిచిన దుండగుడు

మహిళా కానిస్టేబుల్ను కత్తితో పొడిచిన దుండగుడు

మద్యం మత్తులో ఓ దుండగుడు RPF మహిళా కానిస్టేబుల్ ను విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. రైలులోని మహిళా కంపార్ట్ మెంట్ లోకి తప్పతాగి ఎక్కాడు. విధులు నిర్వహిస్తున్న అశిర్వ అతడిని కిందకు దిగిపోవాలని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశాడు. అందులో ఉన్న ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో అతడు రైలు దిగి పారిపోయాడు. మంగళవారం రాత్రి 8.45 గంటలకు చెన్నై బీచ్‌ నుంచి చెంగల్‌పేట వెళ్లే సబర్బన్‌ రైలు స్టేషన్ నుంచి బయల్దేరేందుకు సిద్ధమైంది. పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి రైలు ఎక్కాడు. మహిళా ప్రయాణికుల కోసం కేటాయించిన కంపార్ట్‌మెంట్ నుండి దిగమని మహిళా కానిస్టేబుల్ సూచించింది. దీంతో కోపంతో ఊగిపోయిన దుండగుడు కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. అనంతరం రైలు కదులుతుండగా కిందకు దూకి తప్పించుకున్నాడు.  

దుండగుడి దాడిలో గాయాలైన మహిళా కానిస్టేబుల్‌ కూడా కిందకు దిగి ఇతర ఆర్‌పిఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీ సహాయంతో మహిళా కానిస్టేబుల్ను కత్తితో పొడిచిన వ్యక్తిని గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.