మినీ ఐపీఎల్: రస్సెల్ మెరుపులు వృథా.. చెన్నైదే తొలి విజయం

మినీ ఐపీఎల్: రస్సెల్ మెరుపులు వృథా.. చెన్నైదే తొలి విజయం

అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్ సీ) టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ.. టెక్సాస్ సూపర్ కింగ్స్ మంచి ఆరంభం చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ.. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే (55),  డేవిడ్ మిల్లర్(61) ఆఫ్ సెంచరీలతో మెరిశారు. నైట్ రైడర్స్ బౌలర్లలో అలీఖాన్, లకీ ఫర్గూసన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. సునీల్ నరైన్, ఆడం జంపా చెరో ఒక వికెట్ పడగొట్టారు.

అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 112 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఆండ్రూ రస్సెల్(55; 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులు) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. మార్టిన్ గుప్తిల్ (0), రిలీ రోసో(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా.. భారత యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ 4 పరుగులకే వెనుతిరిగాడు. పరుగులు వస్తున్నా.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ఆ జట్టును దెబ్బతీసింది. సూపర్ కింగ్స్ బౌలర్లలో మహమ్మద్ మోసిన్ 4 వికెట్లు తీసుకోగా.. రస్టీ తెరోన్, కోజీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.