
చెన్నై: రోడ్డు పనుల కోసం తవ్విన గుంటలో ఓ కారు సగం వరకు కూరుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి గాయాలపాలవడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, మిగతా వాహనదారులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు. చెన్నైలోని గిండి ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
వివరాలు ఇలా.. చెన్నైలోని మైలాపూర్ అప్పు స్ట్రీట్ కు చెందిన ధనేశ్వరన్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం అతను మైలాపూర్ నుండి తన కారులో మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం కిండిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో గిండి ఫ్లైఓవర్ దగ్గరకు వెళుతుండగా, ధనేశ్వరన్ కారు అదుపుతప్పి రోడ్డు పనుల కోసం రోడ్డు పక్కన తవ్విన గుంటలో పడింది.
ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు వెంటనే ధనేశ్వరన్ ను రక్షించి ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. తనేశ్వరన్ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునజ్జయింది. గిండి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.