
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హెచ్చరించారు. వర్గీకరణ సాధ్యం కాదని ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారని, దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వర్గీకరణకు ఒప్పుకోవడం లేదని గుర్తుచేశారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మాలమహానాడు నేషనల్ ఆఫీసులో చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి, ఒక వర్గం ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సాధ్యం కాని వర్గీకరణకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు.
ఇందుకు నిరసనగా సోమవారం బీజేపీ, మంగళవారం కాంగ్రెస్ హెడ్డాఫీసుల ముట్టడికి పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై కిషన్ రెడ్డి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని, ఎంఆర్ పీఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తూ ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేసినా మాల, మాల ఉపకులాలు ఓటుతో బుద్ధి చెబుతాయన్నారు. ఎస్సీ వర్గీకరణను మేనిఫెస్టోలో చేర్చే పార్టీలకు ఓటుతోనే సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
కర్నాటకలో బీజేపీ చివరి నిమిషంలో ఎస్సీ వర్గీకరణపై మాట్లాడినందుకు దళితులందరూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే విషయాన్ని గుర్తించాలన్నారు. త్వరలో ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మాలమహానాడు అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్, ఉపాధ్యాక్షుడు గోకుల కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.