సుమన్​ మీటింగ్​కు పార్టీ లీడర్ల గైర్హాజరు

సుమన్​ మీటింగ్​కు పార్టీ లీడర్ల గైర్హాజరు
  • విభేదాలతో హాజరుకాని జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు

జైపూర్(భీమారం)వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీటింగ్​కు అక్కడి బీఆర్​ఎస్​నేతలెవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. భీమారం మండల కేంద్రంలోని పార్టీ లీడర్ చెరుకు సరోత్తం రెడ్డి ఇంట్లో నేతలతో ఎన్నికల ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన కార్యచరణ తదితర అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.

అంతర్గత విభేదాలతో మండల జడ్పీటీసీ భూక్య తిరుమలతోపాటు భీమారం, దాంపూర్, ధర్మారం, కాజిపల్లి, బూరుగుపల్లి, ఆరేపల్లి, మద్దికల్ గ్రామాల సర్పంచులు సమావేశానికి హాజరుకాలేదు. భీమారం, కాజిపల్లి ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, కొందరు వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు సైతం గైర్హాజరవడం మండల వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. వీరంతా అంతర్గత విభేదాలతోనే హాజరు కాలేదని తెలుస్తోంది. వీరిలో పలువురు పార్టీ మారే అవకాశం ఉందని కూడా జోరుగా చర్చ నడుస్తోంది. సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ అలిగిన లీడర్లను బుజ్జ గించాలని పార్టీ లీడర్లను కోరడం పరిస్థితికి అద్దం పడుతోంది.

బీఆర్ఎస్ ప్లెక్సీలో నల్లాల భాగ్యలక్ష్మి ఫొటో

సమావేశానికి బాల్క సుమన్​కు ఆహ్వానిస్తూ సరోత్తం రెడ్డి తన ఇంటి ముందు భారీ ఫ్లెక్సీనీ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో కొద్దిరోజుల క్రితమే పార్టీకి వీడి కాంగ్రెస్ లో చేరిన జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఫొటో ఉండడం గమనార్హం. ఆ ఫ్లెక్సీని చూసిన పలువురు భాగ్యలక్ష్మి బీఆర్​ఎస్​ను వీడారా? లేకా అందులోనే ఉన్నారా? అని చర్చించుకున్నారు.