జనాభా ప్రాతిపదికన దళితుల రిజర్వేషన్లు ఖరారు చేయాలి : వివేక్ వెంకటస్వామి

జనాభా ప్రాతిపదికన దళితుల రిజర్వేషన్లు ఖరారు చేయాలి : వివేక్ వెంకటస్వామి
  • మాలలంతా ఏకమై హక్కులు సాధించుకోవాలి
  • కాకినాడలో మాలల రణభేరి మీటింగ్​కు హాజరు

హైదరాబాద్, వెలుగు: జనాభా ప్రాతిపదికన దళితుల రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్​చేశారు. ముందుగా దళితుల్లో ఎవరికి అన్యాయం జరిగిందనే అంశంపై కమిటీ ఏర్పాటు చేయాలని.. ఆ రిపోర్ట్ ఆధారంగానే వర్గీకరణ అమలు చేయాలని ఆయన అన్నారు. సోమవారం ఏపీలోని కాకినాడలో జరిగిన మాలల రణభేరి మీటింగ్ కు వివేక్ హాజరై మాట్లాడారు. కొంత మంది రాజకీయ నాయకులు ఓట్ల కోసమే వర్గీకరణ అంశాన్ని వాడుకుంటున్నారని.. ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. రిజర్వేషన్లు అన్ని  రంగాల్లో కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులంతా ఐక్యంగా ఉండి  హక్కులను సాధించుకోవాలన్నారు. 

మాలలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. మాలలంతా ఏకతాటిపైకి వచ్చి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో అందరం కలిసి ఐక్యంగా పోరాడుతున్నామని చెప్పారు. ముందుగా అన్ని జిల్లాల్లో మీటింగులు నిర్వహించి, హైదరాబాద్​పరేడ్ గ్రౌండ్ లో భారీ పబ్లిక్ మీటింగ్ నిర్వహించామని తెలిపారు. ఆ మీటింగ్​కు మాలలంతా స్వచ్ఛందంగా వచ్చి ఐక్యతను చాటి చెప్పారని వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. అంతకుముందు కాకినాడ మీటింగ్ కు వచ్చిన  ఎమ్మెల్యేకు మాల సంఘాల నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ నుంచి మాలల ఆశాజ్వోతి వివేక్ వెంకటస్వామి రావడం ఆనందంగా ఉందని మాల సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు తెలిపారు.