ప్రజల ఆశలు వమ్ము చేయం .. ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తాం: వివేక్‌‌ వెంకటస్వామి

ప్రజల ఆశలు వమ్ము చేయం .. ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తాం: వివేక్‌‌ వెంకటస్వామి
  • టెండర్ ద్వారా సింగరేణి నాలుగు మైన్స్ పొందాలని సీఎం రేవంత్‌‌ను కోరా 
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌ సర్కార్‌‌‌‌ ఖజానాను ఖాళీ చేసి, రూ.6 లక్షల కోట్ల అప్పు చేసింది 
  • అసైన్డ్, పట్టా భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సీరియస్‌‌గా పనిచేస్తున్నది
  • అర్హులందరికీ కచ్చితంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న చెన్నూరు ఎమ్మెల్యే

కోల్​బెల్ట్, వెలుగు: తమ జీవితాల్లో మార్పు వస్తుందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ సర్కార్‌‌‌‌పై ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజల అవసరాలు తీర్చి వారి సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిందన్నారు. 

బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జల, పౌనూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ నాలుగు బొగ్గు బ్లాక్‌‌లను దక్కించుకోవడానికి ఓపెన్ టెండర్లలో పాల్గోనేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని చెప్పారు. 2015లో సింగరేణి సంస్థ ఓపెన్ టెండర్ల ద్వారా నాలుగు బొగ్గు బ్లాక్‌‌లను పొందకుండా గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ఇటీవల సీఎం రేవంత్‌‌ని కలిసి నాలుగు బొగ్గు బ్లాక్‌‌లు పొందడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. 

త్వరలో దీనిపై కార్యాచరణ అమలు చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మొదటి హామీ ప్రకారం సింగరేణిలో 80 శాతం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు స్థానికులకు కల్పించే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో ఉత్తర్వులు ఇప్పించానని వివేక్‌‌ గుర్తు చేశారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌‌లో కొత్తగా 850 మెగావాట్ల మూడో యూనిట్‌‌ని ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో దానిపై కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త గనులు, పవర్ ప్లాంట్ విస్తరణ, 80 శాతం ఉద్యోగాల కల్పనతో కోల్‌‌బెల్ట్ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. తాను హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేస్తానని పేర్కొన్నారు. 

రూ.400 కోట్లతో కరకట్ట నిర్మాణం..

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌‌‌‌తో భూములు ముంపునకు గురికాకుండా రూ.400 కోట్లతో కరకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బొట్టు నీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజలకు డబుల్​బెడ్‌‌రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వని కేసీఆర్ సర్కార్ ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని రూ.6.71 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందన్నారు. 

రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా మిషన్ భగీరథలో ఎక్కడా నీళ్లు రావడం లేదన్నారు. నాసిరకంగా వేసిన పైపులు పగిలిపోయాయని, దీనిని ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్ అధికారులు సీరియస్‌‌గా తీసుకోవాలని సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ లోపాలను త్వరగా సరిదిద్దాలని, ఫండ్స్ కావాలంటే తన దృష్టికి తీసుకొస్తే సర్కార్‌‌‌‌తో మాట్లాడి సాంక్షన్ చేయిస్తానని చెప్పారు. ఈ నెల 10న మిషన్​ భగీరథపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్‌‌ సంతోశ్​ను ఆదేశించారు. నెలలోపు ఇంటింటికి నీళ్ల సప్లై కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 

317జీవోను సీఎం దృష్టికి తీసుకెళ్తా..

మంచిర్యాలలోని తన నివాసంలో వివేక్ వెంకటస్వామిని ప్రభుత్వ జీవో 317 బాధిత టీచర్లు కలిశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ నియంతృత్వ విధానాలను తీసుకొచ్చి తమని నాశనం చేశారని టీచర్లు వాపోయారు. బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన 317 జీవో వల్ల తమ జీవితాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర జిల్లాలకు బదిలీ అయి మానసికంగా కుంగిపోయి 20 మంది ప్రభుత్వ టీచర్లు ఆత్మహత్యలకు పాల్పడినా గత సర్కార్​కనికరించలేదన్నారు. 317 జీవోపై ప్రభుత్వంలో డిస్కషన్ జరుగుతుందని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

అర్హులందరికీ ఆరు గ్యారంటీలు..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు అపోహ పడొద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాల అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 6 లోగా దరఖాస్తు చేసుకోవాలని, అర్హులందరికీ పథకాలు అందుతాయని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేస్తానని, ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు

అసైన్డ్, పట్టా భూముల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ పనిచేస్తున్నదని చెప్పారు. ప్రజల దగ్గరికే పాలన రావాలని ప్రజా పాలన అని పేరు పెట్టినట్లు చెప్పారు. రేవంత్​రెడ్డి సీఎం ఆయ్యాక ప్రగతి భవన్‌‌ని ప్రజా భవన్‌‌గా మార్చడం, సెక్రటేరియెట్‌‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అభ్యయహస్తం దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్​ బదావత్​ సంతోశ్​, డీఆర్​డీవో శేషాద్రి, వెటర్నరీ జేడీ రమేశ్​ పాల్గొన్నారు.