-
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామినేతృత్వంలో ముందుకెళ్తం
-
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వెల్లడి
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ రిజర్వేషన్లు ఎత్తేయాలనే కుట్రలో భాగంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆరోపించింది. ఎస్సీ వర్గీకరణను ఏమాత్రం స్వాగతించేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల్లోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, మాలలు సోమాజిగూడలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఆయన ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మాలల హక్కుల కోసం ముందుకు వచ్చి సమస్యను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని వివేక్ ని కోరారు.
అనంతరం పోరాట సమితి నాయకులు చెన్నయ్య, బేరా బాలకిషన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న మాల కులస్తుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ చేపడ్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మాలలను చైతన్యవంతం చేసి ఉద్యమిస్తామన్నారు. 30 ఏండ్లుగా మాలలు మౌనం వహిస్తూనే ఉన్నారని, ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల సంఘాలన్నీ ఏకమై వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ముందుకు వెళ్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో బూర్గుల వెంకటేశ్వర్లు, తలమల హుస్సేన్, చెరకు రాంచందర్, నల్లాల కనకరాజు, తాళ్లపల్లి రవి, గోపోజు రమేశ్, తాలూకా అనిల్ కుమార్, నాందేవ్ తో పాటు 33 జిల్లాల నుంచి మాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.