సింగరేణిలో బీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు: వివేక్ వెంకటస్వామి

సింగరేణిలో బీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు: వివేక్ వెంకటస్వామి
  • 28 వేల ఉద్యోగాలు తగ్గితే కొప్పుల నోరు విప్పలే: వివేక్‌ వెంకటస్వామి
  •  తాము పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తే.. బీఆర్‌‌ఎస్ లీడర్లు జాబ్స్ అమ్ముకున్నారని విమర్శ 
  • కార్మికుల కోసం కష్టపడ్డది కాకా కుటుంబమేనని వెల్లడి
  •  రామగుండం ఎన్టీపీసీ వద్ద వంశీకృష్ణతో కలిసి వివేక్‌ ఎన్నికల ప్రచారం 

యైటింక్లయిన్​కాలనీ, వెలుగు: సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తుంటే రాష్ట్ర మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని, ఇప్పుడొచ్చి తాను గని కార్మికుడినంటూ ఓట్ల కోసం నాటకాలాడుతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. గురువారం రామగుండం ఎన్టీపీసీ వద్ద గేట్ మీటింగ్‌లో, యైటింక్లయిన్ కాలనీ, బసంత్ నగర్, అంతర్గాంలో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ ఠాకూర్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్‌‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు సింగరేణిలో 66 వేల మంది కార్మికులుండగా.. పదేండ్లలో 28 వేల ఉద్యోగాలను తగ్గించారని, ఇప్పుడు కార్మికుల సంఖ్య 38 వేలకు చేరిందన్నారు. కొప్పుల ఈశ్వర్‌‌ కార్మికులను మర్చిపోయారని, వారి కోసం ఆయన చేసిందేమీ లేదన్నారు. వారిని ఓటు అడిగే హక్కు బీఆర్‌‌ఎస్‌ లేదన్నారు. కార్మికుల కోసం కష్టపడ్డది కాకా వెంకటస్వామి కుటుంబమేనని చెప్పారు. 

కార్మికుల గురించి వంశీకి అవగాహన ఉంది..

సింగరేణి సంస్థ నష్టాలతో బీఐఎఫ్‌ఆర్ జాబితాలో చేరినప్పుడు ఎన్టీపీసీ ద్వారా రూ.450 కోట్ల రుణాన్ని ఇప్పించి సంస్థను కాపాడిన ఘనత వెంకటస్వామిదని అన్నారు. ఆయన తీసుకున్న చర్యల వల్లే సింగరేణిలో లక్షా 20 వేల మంది కార్మికులకు ఉద్యోగ భద్రత ఏర్పడిందని గుర్తుచేశారు. కార్మికులకు పెన్షన్ స్కీమ్ కూడా కాకా వల్లనే సాధ్యమైందని చెప్పారు. కాకా చొరవతోనే హైదరాబాద్‌లో ఉన్న సీఎంపీఎఫ్ ఆఫీస్ గోదావరిఖనికి వచ్చిందన్నారు. మూతపడ్డ రామగుండం ఎఫ్‌సీఐని పునరుద్ధరించేందుకు కాకా వెంకటస్వామితో పాటు తాను ఎంపీగా కృషి చేసినట్టు వివేక్ చెప్పారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో మాట్లాడి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయించి రూ.10 వేల కోట్ల వడ్డీని మాఫీ చేయించామని, దానివల్ల రూ.6,300 కోట్ల పెట్టుబడితో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమైందన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు తాము ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయిస్తే.. బీఆర్‌‌ఎస్ పార్టీ వాళ్లు రూ.కోట్లు వసూలు చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎంపీగా ఉన్న వెంకటేశ్ నేత ఇక్కడి ప్రజల కష్టాలను పట్టించుకోలేదని ఆరోపించారు. కార్మికుల గురించి పూర్తి అవగాహన ఉన్న యువ పారిశ్రామిక వేత్త వంశీకృష్ణను గెలిపించాలని వివేక్‌ కోరారు. 
 
మోదీ, కేడీ మాటలు నమ్మొద్దు: రాజ్ ఠాకూర్​

దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ మాయమాటలతో ఓట్లు దండుకోవడానికి మళ్లీ వస్తున్నారని, మోదీ, కేడీల మాటలను కార్మికులు, ప్రజలు నమ్మొద్దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. పదేండ్లు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఎన్నడూ కార్మికుల సమస్యలపై మాట్లాడలేదన్నారు. ఎన్టీపీసీలో కార్మికులు సమ్మె చేసినప్పుడు పోలీసులు లాఠీ చార్జ్‌ చేస్తే బాధితులను కనీసం పరామర్శించలేదని గుర్తుచేశారు. సింగరేణి కార్మికులకు ఇన్‌కమ్​ట్యాక్స్ మినహాయింపు కోసం కృషి చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేయర్ అనిల్ కుమార్, లీడర్లు రాజేశ్, ఆసిఫ్ పాష, మహాంకాళి స్వామి, కొలిపాక సుజాత, గుండేటి రాజేశ్, మారెల్లి రాజిరెడ్డి, శంకర్ నాయక్, హరిహర నాయక్, దామోదర్​రావు, సలావుద్దీన్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, సమ్మయ్య, మనోహర్ రెడ్డి, అంజయ్య, మహేశ్ పాల్గొన్నారు.

కార్మిక ద్రోహి బీఆర్‌‌ఎస్ పార్టీ: గడ్డం వంశీకృష్ణ 

బీఆర్‌‌ఎస్ కార్మిక ద్రోహుల పార్టీ అని, కష్టపడి పనిచేసిన వారిని గుర్తించలేదని, వారి సంపాదనను దోచుకున్నదని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల్లో బీఆర్‌‌ఎస్ లీడర్లు రూ.లక్షల్లో లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. తనకు ఎంపీగా అవకాశం ఇస్తే సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరామ్, ఇతర పరిశ్రమల కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటుకు పోరాటం చేస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కార్మికుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. రామగుండం ఎన్టీపీసీని సీ కేటగిరీ నుంచి బీ కేటగిరీకి మార్పిస్తానని, ఈఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్టీపీసీలో జీవో 22ను అమలు చేయాలని, ఐటీఐ చేసిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత పదేండ్ల కాలంలో తాము అధికారంలో లేకపోయినా విశాక ట్రస్ట్, కాకా ఫౌండేషన్ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. పది మందికి సహాయం చేసే స్థితిలోనే ఉన్నామని, డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు.