చెన్నూరులో రజాకార్ ​పాలన .. బాల్క సుమన్​ ఆగడాలతో మనస్తాపం చెందా: నల్లాల ఓదెలు

చెన్నూరులో రజాకార్ ​పాలన .. బాల్క సుమన్​ ఆగడాలతో  మనస్తాపం చెందా: నల్లాల ఓదెలు
  • కేసీఆర్, కేటీఆర్​ మాట ఇచ్చి మోసం చేసిన్రు 
  • నాడు బీఆర్ఎస్​లో చేరి తప్పు  చేసినం..క్షమించండి
  • మాజీ విప్​ నల్లాల ఓదెలు 

కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో రజాకార్ ​పాలన సాగుతోందని, ఎమ్మెల్యే బాల్క సుమన్​ఆగడాలతో మనస్తాపం చెంది బీఆర్ఎస్​పార్టీని విడిచి మళ్లీ కాంగ్రెస్ లో చేరామని మాజీ విప్​నల్లాల ఓదెలు అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఆయన ఇంట్లో తన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మితో  కలిసి మాట్లాడారు. చెన్నూరు నుంచి సుమన్​కు టికెట్​ఇచ్చిన టైమ్​లో తనకు సముచిత స్థానం ఇస్తామని సీఎం కేసీఆర్​, కేటీఆర్​ మాట ఇచ్చి తర్వాత మోసం చేశారన్నారు. 

తన భార్యకు జడ్పీ చైర్​పర్సన్​ పదవి  ఇచ్చినా బాల్క సుమన్ ఎప్పుడూ అవమానించేవారన్నారు. సుమన్ అరాచకాలు, ఆగడాలతో  ఏడాది కింద కాంగ్రెస్​లో చేరినట్లు చెప్పారు. సుమన్​ఓడిపోయే అవకాశం ఉందని, 2023లో చెన్నూరు టికెట్​ఇస్తానని కేటీఆర్ ఇచ్చిన​హామీతో తిరిగి బీఆర్ఎస్​లో చేరామన్నారు. కానీ, బీఆర్ఎస్​లో చేరి పెద్ద పొరపాటు చేశామని, ఇందుకు ప్రజలకు క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు.

సుమన్ ​బతిమిలాడిండు..బెదిరించిండు.. 

కేసీఆర్ మళ్లీ సిట్టింగులకు టికెట్​ఇవ్వడంతో పార్టీకి దూరంగా ఉన్నానని, సుమన్​ రెండు సార్లు తన ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని, పార్టీలో కొనసాగాలని కోరినట్లు చెప్పారు. మూడోసారి వచ్చి ఎలాంటి పదవి ఇచ్చేది లేదని, మామూలు కార్యకర్తగా ఉండాలని బెదిరించాడని ఆరోపించారు. తాను రూ.3 కోట్లు తీసుకున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని, తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్​అధిష్టానం తనకు అవకాశం ఇస్తే సుమన్​ను ఓడిస్తానన్నారు. 

పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. జీవితాంతం కాంగ్రెస్​లోనే ఉంటామని ప్రమాణం  చేస్తున్నట్లు చెప్పారు. సుమన్​ చెప్పే అభివృద్ధి అంతా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైనవే అని, దీనిపై బహిరంగచర్చకు సిద్ధమని,  సుమన్​ సిద్ధమా అని సవాల్​ విసిరారు. కాంగ్రెస్​ లీడర్లు దుర్గం నరేశ్​, ఇబ్రహీం, ప్రభాకర్​పాల్గొన్నారు.