కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్లగొండ ఎస్పీకి చెరుకు సుధాకర్ ఫిర్యాదు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్లగొండ ఎస్పీకి చెరుకు సుధాకర్ ఫిర్యాదు

నార్కట్​పల్లి/ నల్లగొండ అర్బన్, వెలుగు: ఉద్యమ నాయకుడినైన తనను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూషించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, వెంటనే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లిలో తన తండ్రి చెరుకు ఉష గౌడ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సుధాకర్ మీడియాతో మాట్లాడారు. బీసీ కులానికి చెందిన నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెంకట్ రెడ్డి అహంకారాన్ని తెలియజేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పనిచేయించాల్సిదిపోయి.. వెంటకట్​రెడ్డి అట్లా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ను పూర్తిగా డ్యామేజ్ చేయాలన్నదే కోమటిరెడ్డి లక్ష్యంగా కనిపిస్తున్నట్లు ఉందన్నారు. ఈ విషయాన్ని త్వరలోనే పార్లమెంటు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధులు పున్న కైలాష్, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.

రక్షణ కల్పించండి: సుహాస్​

తన తండ్రి చెరుకు సుధాకర్​ను, తనను చంపేస్తానని బెదిరించిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని అరెస్టు చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వరావుకు డాక్టర్ చెరుకు సుహాస్ విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి ఆయన నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. సోమవారం మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణతో కలిసి వెంకట్ రెడ్డిపై ఎస్పీకి కంప్లైంట్​చేశారు. ఈ సందర్భంగా సైదులు గౌడ్ మాట్లాడుతూ.. డాక్టర్ చెరుకు సుధాకర్ ను చంపుతానని బెదిరించిన ఎంపీ వెంకటరెడ్డిపై ఈనెల 5న నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ చేయలేదని, ఆయన్ను అరెస్టు చేయలేదని అందుకే జిల్లా ఎస్పీని కలిసి కోరామన్నారు. జిల్లాలో ఏ బహుజన నాయకుడు ఎదిగినా ఓర్వలేనితనం వెంకట్ రెడ్డిది అని విమర్శించారు. చెరుకు సుధాకర్ కు పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం ఓర్వలేకనే వెంకటరెడ్డి ఈ విధంగా చేస్తున్నారని అన్నారు. కనీస విలువలు లేకుండా ఒక ఉద్యమకారుడిని తిట్టడం వెంకటరెడ్డి అహంకారానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ హైకమాండ్​కూడా దీనిపై స్పందించాలన్నారు.