చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచుల గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ సహకారంతో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు బుధవారం చేవెళ్లలోని కేజీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇస్తోందని, అందరూ ఐక్యంగా పనిచేసి ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రలోబాలకు గురికావొద్దని, 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులను ఎవరికీ ఆపే దమ్ములేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం చేవెళ్ల మండలం నాంచేరు సర్పంచ్ ఆశోక్ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, సీనియర్ నాయకులు అంజన్ కుమార్ గౌడ్, కంజర్ల ప్రకాశ్, ప్రభాకర్ రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
