డ్యాంలో ఫోన్ పడిపోయిందని.. 21 లక్షల లీటర్ల నీరు ఖాళీ చేయించాడు

డ్యాంలో ఫోన్ పడిపోయిందని.. 21 లక్షల లీటర్ల నీరు ఖాళీ చేయించాడు

ఛత్తీస్ గడ్లో ఓ ప్రభుత్వాధికారి చెత్త పని చేశాడు. స్మార్ట్ ఫోన్ కోసం  నీటితో నిండి ఉన్న రిజర్వాయర్ ను  ఖాళీ చేయించాడు. సెల్ఫీ తీసుకుంటుండగా..ఫోన్ రిజర్వాయర్ లో పడిపోయింది. దీంతో ఫోన్ కోసం రిజర్వాయర్ లో ఉన్న  నుంచి 21 లక్షల లీటర్ల  నీటిని ఖాళీ చేశాడు. 

ఏం జరిగిందంటే..

ఛత్తీస్‌గఢ్‌ కోయలిబెడ బ్లాక్‌కు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ సెలవురోజున  కంకేర్ జిల్లాలోని ఖేర్‌క‌ట్టా డ్యామ్‌కు త‌న మిత్రుల‌తో క‌లిసి మే 21వ తేదీన ఆదివారం పిక్నిక్ కి వెళ్లాడు. ఈ సందర్బంగా  సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే చేయి జారీ తన  రూ. 96,000 విలువగల సామ్ సంగ్ S23 ఫోన్‌ డ్యాంలో పడిపోయింది. ముఖ్యమైన డేటా ఉందంటూ ఫోన్ కోసం ఈతగాళ్లతో వెతికించాడు. కానీ దొరకలేదు. దీనితో విశ్వాస్ నీటిపారుదల శాఖ కార్యాలయానికి వెళ్లాడు. డ్యాంలో మునిగిన తన ఫోన్‌ను ఎలా సాధించాలని  చర్చించారు. చివరికి  రిజర్వాయర్ నుంచి నీటిని బయటకు తోడాలని నిర్ణయించుకున్నాడు. 30 హార్స్ పవర్ డీజిల్ పంపుల‌తో వ‌రుస‌గా మూడు రోజుల పాటు 15 అడుగుల  నీటిని తొడించేశాడు.

ఫోన్ దొరికిందా...

వ‌రుస‌గా మూడు రోజుల పాటు నీటిని తోడిన తర్వాత ఫోన్ దొరికింది. కానీ అప్పటికే నీటిలో పూర్తిగా తడిసిపోవడంతో ఫోన్ పనిచేయలేదు. ఎంత ప్రయత్నించినా ఫోన్ ఆన్ కాలేదు.  మూడు రోజుల ఆరబెట్టాడు. అయినా ఫోన్ పనిచేయలేదు.    

విమర్శలు.. సస్పెండ్  

మే 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పంపుల ద్వారా 21 లక్షల లీటర్ల నీటిని తోడేయడంపై విమర్శలు చెలరేగాయి. ఈ విషయమై కలెక్టర్ కు  ఫిర్యాదు అందడంతో నీటిపారుదల, జలవనరుల శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రక్రియను నిలిపివేశారు. ఆ తర్వాత అధికారాన్ని  దుర్వినియోగం చేయడంతోపాటు నీటిని ఖాళీ చేయడంపై అనుమతి తీసుకోకపోవడంతో కంకేర్ జిల్లా కలెక్టర్ రాజేష్ విశ్వాస్ ను  సస్పెండ్ చేశాడు. 

సాగుకు పనికిరాదని తోడేశాడట...

ఖేర్‌క‌ట్టా  డ్యామ్ నుంచి తోడేసిన నీరు సాగుకు పనికిరాదని  రాజేష్ విశ్వాస్ బుకాయిస్తున్నాడు. డ్యాంలో పడిపోయిన ఫోన్ లో ముఖ్యమైన ప్రభుత్వ డేటా ఉందని..అందుకోసమే నీటిని తోడేశానని చెప్పుకొచ్చాడు.  నీటిని ఖాళీ చేయడానికి కంకేర్ నీటిపారుదల శాఖ ఎస్డీవో ద్వారా మౌఖిక అనుమతి తీసుకున్నామంటున్నాడు.  డీజిల్ పంపుతో నీరు తోడటానికి రూ.7,000 నుంచి -8,000 వరకు ఖర్చు అయిందని..దాని వల్ల ఏ రైతు కూడా నష్టపోలేదని విశ్వాస్ అన్నారు. 

ఖాళీ చేసిన నీటితో 1,500 ఎకరాలకు సాగునీరు

మూడు రోజుల పాటు 21  లక్షల లీటర్ల నీరు బయటకు పోయింది. నీరంతా వృథాగా పోవడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నీటితో  సుమారు 1,500 ఎకరాల భూమికి సాగునీరు అందించే అవకాశం ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.