శ్రీశైలం పులిహోర ప్రసాదంలో.. చికెన్ బొక్కలు

శ్రీశైలం పులిహోర ప్రసాదంలో.. చికెన్ బొక్కలు

శివయ్యా.. ఏంటయ్యా.. మహా పుణ్యక్షేత్రం అయిన నీ ఆలయంలో ఏంటీ అపచారం.. శ్రీశైలం భక్తులు ఇప్పుడు ఇదే అంటున్నారు. శ్రీశైలం వచ్చిన ఓ భక్తుడు.. శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. అక్కడే ఆ ప్రసాదాన్ని తింటుండగా.. అందులో చికెన్ ఎముక వచ్చింది.. శాఖాహారం.. ఎంతో నిష్ఠగా తయారయ్యే పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావటం కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆలయ పరిధిలోని అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ప్రసాదం స్వీకరించిన  భక్తుడు హరీష్ రెడ్డికి పులిహోరలో మాంసపు ఎముక కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా ఎముక ముక్కను చూపించి ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన పుణ్య క్షేత్రంలో ఈ అపచారం ఏంటని సదరు భక్తుడు ప్రశ్నించాడు. 

ALSO READ :- పీవీకి భారతరత్న రావడం పట్ల సీఎం రేవంత్రెడ్డి హర్షం

ఇలాంటి ఘటనలతో పుణ్యక్షేత్రాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రసాదంలో మాంసపు ఎముక వచ్చిందంటూ హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన భక్తుడు ఏకంగా కంప్లయింట్ చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పులిహోరలో మాంసపు ఎముకపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని భక్తుడు హరీష్ రెడ్డి స్వయంగా కంప్లయింట్ ఇవ్వటంతోపాటు.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.