మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి : సుదర్శన్ రెడ్డి

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి : సుదర్శన్ రెడ్డి
  • రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

కామారెడ్డి, వెలుగు: ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరగాలని,  గ్రామ పాలన అధికారులు, ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు.  బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,  అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో  లు వీణ, పార్థ నరసింహా రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.