
- కొత్త సీజేకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు నిష్పాక్షిక న్యాయం అందించడానికి న్యాయవాదుల సహకారం అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. న్యాయవాదుల సహకారం లేకుండా ప్రజలకు న్యాయం అందించలేమని అభిప్రాయపడ్డారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను శుక్రవారం హైకోర్టు బార్ అసోసియేషన్ సత్కరించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. తాను కూడా న్యాయవాదిగానే వృత్తిని ప్రారంభించి ఈ స్థాయి వచ్చానని, సీనియర్ లతోపాటు జూనియర్ న్యాయవాదులపైనా గౌరవం ఉందన్నారు.
సమాజంలో అన్ని వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థ కూడా ఒకటని, ప్రతి వ్యవస్థకూ సమాన గౌరవం ఉంటుందన్నారు. అందరి సహకారంతో ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌తోపాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రధాన న్యాయమూర్తిని సన్మానించారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, పలువురు జడ్జిలు పాల్గొన్నారు.