లీగల్ రీసెర్చ్​లో గేమ్ చేంజర్ ఏఐ

లీగల్  రీసెర్చ్​లో గేమ్ చేంజర్ ఏఐ

న్యూఢిల్లీ: లీగల్  రీసెర్చ్ లో ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ (ఏఐ) ది గేమ్ చేంజర్  పాత్ర అని సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్  డీవై చంద్రచూడ్  అన్నారు. కోర్టు కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీ వాడే విషయంలో ఆ టెక్నాలజీపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా, సింగపూర్  సుప్రీంకోర్టుల మధ్య ‘టెక్నాలజీ అండ్  డైలాగ్’ అన్న విషయంపై జరుగుతున్న రెండు రోజుల సమావేశంలో సీజేఐ మాట్లాడారు. కోర్టు తీర్పుల్లో ఏఐ టెక్నాలజీని వాడితే అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. 

ఒకవైపు ఏఐతో అసమాన అవకాశాలు ఉన్నాయని, మరోవైపు దాని వాడకంపై సమస్యలు, సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని చెప్పారు. ఇలాంటి సవాళ్లను అధిగమించాలంటే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, సంస్థలు కలిసికట్టుగా శ్రమించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. లాయర్లు, జడ్జీలు పనిచేసే తీరులో గొప్ప మార్పులు తెచ్చే సామర్థ్యం ఏఐకి ఉందన్నారు. లీగల్  రీసెర్చ్, కేస్  అనాలిసిస్ ను పెంచడంతో పాటు కోర్టు కార్యకలాపాల సామర్థ్యాన్ని ఏఐ టెక్నాలజీ మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

అలాగే అసమాన సామర్థ్యం, కచ్చితత్వంతో లీగల్  ప్రొఫెషనల్స్ కు ఏఐ సాధికారత కల్పిస్తోందని చెప్పారు. ‘‘కోర్టు తీర్పులో ఏఐ టెక్నాలజీని వాడాలా వద్దా అన్న ప్రశ్నను తప్పించుకోలేం. ఆ టెక్నాలజీతో ఒకవైపు ఉపయోగాలతో పాటు దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్, ట్రైనింగ్  ప్రోగ్రామ్స్​లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఏఐ వాడకంలో ఉన్న సవాళ్లను అధిగమించడంలో చాలినంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్న వ్యక్తులు ప్రొఫెషనల్స్ కు శిక్షణ ఇవ్వాలి” అని సీజేఐ వ్యాఖ్యానించారు.