కొత్తగా వచ్చిన ఫారెస్ట్ వర్సిటీకి చాన్స్​లర్​గా ముఖ్యమంత్రి

కొత్తగా వచ్చిన ఫారెస్ట్ వర్సిటీకి చాన్స్​లర్​గా ముఖ్యమంత్రి

హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీలపై మరింత పెత్తనం చెలాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నది. గవర్నర్​కు ఉన్న చాన్స్​లర్​ హోదాను తొలగించి.. ఆ హోదాను ముఖ్యమంత్రికి అప్పగించేందుకు ప్రపోజల్స్​ సిద్ధం చేస్తున్నది. రెండురోజుల కిందనే ఫారెస్ట్​ వర్సిటీకి చాన్స్​లర్​గా సీఎంను  నియమించారు. మిగతా స్టేట్​ గవర్నమెంట్​ వర్సిటీలకు కూడా ఇదే రీతిలో ముఖ్యమంత్రికి అధికారాలు అప్పగించే ప్రయత్నాలు  సాగుతున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీలకు చాన్స్​లర్ గా గవర్నర్  కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా గవర్నర్​కు, రాష్ట్ర సర్కారుకు మధ్య పొసగడం లేదు. మంత్రులు నేరుగా గవర్నర్​ వ్యవస్థపైనే విమర్శలు చేస్తున్నారు. మరోపక్క గవర్నర్ అన్ని వర్సిటీల పనితీరుపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ, రివ్యూలు నిర్వహిస్తున్నారు. రివ్యూల సందర్భంగా వర్సిటీల్లోని అనేక సమస్యలు బయటపడుతున్నాయి. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వానికి చాన్స్​లర్​ హోదాలో గవర్నర్​ సూచనలు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్​ను చాన్స్​లర్​ హోదా నుంచి తప్పించి.. సీఎంకు ఆ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ అంశంపై ఉన్నతాధికారులు చర్చలు కూడా జరుపుతున్నారు. అన్ని వర్సిటీలకు చాన్స్​లర్​గా సీఎంను నియమిస్తే వచ్చే లీగల్​ చిక్కులు ఏమిటనే దానిపై చర్చిస్తున్నారు. పశ్చిమ బెంగాల్​లో చట్టం చేసినట్లు ఇక్కడ కూడా చట్టం తెస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

మొత్తం 17 వర్సిటీల్లో..!

రాష్ట్రంలో 17 స్టేట్ గవర్నమెంట్​ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది కొత్తగా తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీని ప్రభుత్వం తెచ్చింది. ఇవన్నీ  విద్యాశాఖతో పాటు హెల్త్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫారెస్ట్ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కొత్తగా వచ్చిన రెండు వర్సిటీలతోపాటు ఆర్జీయూకేటీ (బాసర ట్రిపుల్ ఐటీ) మినహా మిగిలిన యూనివర్సిటీలకు చాన్స్​లర్​గా గవర్నర్  ఉన్నారు. వీటిలో కార్యకలాపాలను గవర్నర్ తమిళిసై పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కాన్వకేషన్​కు ఆమె అటెండ్ అవుతూ.. వర్సిటీల అభివృద్ధికి సూచనలు చేస్తున్నారు. 

ప్రస్తుతం వర్సిటీ వైస్ చాన్స్​లర్ల నియామకాలు కూడా ఆమె ఆమోదించాల్సి ఉంది. ఇటీవల వర్సిటీ వీసీల రిక్రూట్మెంట్ విషయంలో తేడాలు వచ్చినట్టు సమాచారం. వరంగల్​లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్ ను కొనసాగిస్తూ సర్కారు ప్రపోజల్స్ పంపించగా.. గవర్నర్ ఆమోదం తెలుపలేదని తెలిసింది. వర్సిటీల్లో పలు ప్రోగ్రామ్స్ నిర్వహించాలని గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. ‘కనెక్ట్ విత్ చాన్స్​లర్’​ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఆందోళనలతో అట్టుడికిన బాసర ట్రిపుల్​ఐటీతో పాటు తెలంగాణ వర్సిటీని ఇటీవల గవర్నర్​ సందర్శించి.. అక్కడి స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా 75 కాలేజీలను పరిశీలిస్తానని, కాలేజీల వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు, వర్సిటీలకు గవర్నర్ లేఖ రాశారు. కానీ, ఆ లేఖకు విద్యా శాఖ అధికారులు సకాలంలో స్పందించనట్టు తెలిసింది. ఇదే క్రమంలో విద్యా సంస్థల్లో గవర్నర్  పాత్రను తగ్గించాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 

మహిళా వర్సిటీ బిల్లులో కూడా..!

తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రత్యేక బిల్లుకు రెండురోజుల కింద అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంట్లో వర్సిటీ చాన్స్​లర్​గా ముఖ్యమంత్రి ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. ఇతర వర్సిటీల్లో గవర్నర్​కు ఉండే అధికారాలను ఫారెస్ట్​ వర్సిటీ చాన్స్​లర్​గా ఉండే సీఎంకు కల్పించారు. వర్సిటీ తొలి వీసీని చాన్స్​లర్​ నియమిస్తారని, వర్సిటీ స్నాతకోత్సవాలకు అధ్యక్షత వహిస్తారని బిల్లులో పేర్కొన్నారు. ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమైన తెలంగాణ మహిళా యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు కూడా రెడీ అయింది. దాన్ని రెండురోజుల కింద అసెంబ్లీలో పెట్టాల్సి ఉండగా.. పెట్టలేదు. ఈ వర్సిటీకి కూడా చాన్స్​లర్ గా సీఎం పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. అయితే సంప్రాదాయక యూనివర్సిటీ కావడంతో.. ఏమైనా లీగల్ సమస్యలు వస్తాయా అనే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

వెస్ట్ బెంగాల్ తరహాలోనే ఇక్కడా...

దేశంలో ఆయా రాష్ట్రాల గవర్నమెంట్​ యూనివర్సిటీలకు చాన్స్​లర్​గా గవర్నర్​ కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్​లో మాత్రం అక్కడి గవర్నర్​తో ప్రభుత్వానికి విభేదాలు ఉండటంతో ఆ రాష్ట్ర వర్సిటీలకు చాన్స్​లర్​గా ముఖ్యమంత్రిని ఖరారు చేస్తూ చట్టం తెచ్చారు. ఇదే విధానాన్ని తెలంగాణలోనూ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంట్లో భాగంగానే ముందుగానే ఏమైనా లీగల్ సమస్యలు ఉంటాయా అనే అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ముందుగా అన్ని వర్సిటీలకు చాన్స్​లర్​గా సీఎం పేరును ఆమోదిస్తూ స్టేట్​ కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. అయితే.. పూర్తి మెజార్టీతో ఉన్న రాష్ట్ర సర్కారుకు ఇది పెద్ద కష్టమైన పనేమీ కాదు.  

ప్రైవేటు వర్సిటీలకు గేట్లు ఓపెన్

రాష్ట్రంలోని సర్కారు వర్సిటీలు నిధుల్లేక, నియామకాలు జరగక మసకబారుతుండగా.. ప్రైవేటు వర్సిటీలకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ కార్పెట్ పరుస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలు ఉండగా.. తాజాగా మరో ఐదు యూనివర్సిటీలకు సర్కారు ఆమోదం తెలిపింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే ప్రైవేటు వర్సిటీలను తీసుకొస్తున్నామని సర్కారు ప్రకటించినా.. కొత్తగా వచ్చిన వర్సిటీలన్నీ నిన్నమొన్నటి వరకూ కాలేజీలుగా కొనసాగినవే. ఇలాంటి వాటిలో క్వాలిటీ ఎలా వస్తుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. పలు ప్రైవేటు వర్సిటీలు టీఆర్ఎస్ నేతలకు, వారి సంబంధీకులకు చెందినవి ఉండటం గమనార్హం. పైగా ఈ వర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండటం లేదని, ఇష్టారీతిగా ఫీజులు గుంజుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సీఎంకు ఇస్తే ఎట్ల?

యూనివర్సిటీలన్నీ స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలుగా కొనసాగుతున్నాయి. ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాక, ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోయాయి. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇలాంటి టైంలో.. సీఎంను చాన్స్​లర్​గా నియమిస్తే రాజకీయ జోక్యం పెరిగే ప్రమాదం ఉందని, ఫలితంగా యూనివర్సిటీల పరిస్థితి ఇంకింత దిగజారుతుందని విద్యావేత్తలు, స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసీల నుంచి అధికారుల వరకు అన్ని పోస్టుల్లో రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లే  వచ్చి తిష్టవేస్తారని అంటున్నారు. హైదరాబాద్​లో ఉస్మానియా వర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి విలువైన భూములున్నాయి. వీటిపైనా   రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ల కన్నుపడుతుందని విద్యావేత్తలు 
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.