- జహీరాబాద్‌లో 200 ఎకరాల్లో ప్రకృతి వనం
సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎకో పార్క్ ఓపెనింగ్‌కు రెడీ అయింది. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే ఈ ఎకో పార్క్ ను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ 65వ నేషనల్ హైవే పై నిర్మించారు. జహీరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎకో అర్బన్ పార్క్ లంగ్ స్పేస్ గా మారనుంది. ఈ పార్క్ నిర్మాణం కోసం హరిత వనం కింద ప్రభుత్వం రూ.4కోట్లు శాంక్షన్ చేసింది. రెండు విడతలుగా ఫండ్స్ అందినప్పటికీ పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ జోక్యంతో మిగతా పనులు వేగంగా పూర్తి చేశారు. ఈ ఎకో పార్క్ గురువారం నుంచి వినియోగంలోకి రానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, ఫారెస్ట్ అధికారులు, ప్రజలు హాజరుకానున్నారు.
సహజ సిద్ధంగా పార్క్
జహీరాబాద్ ఏకో పార్క్ మిగతా పార్కులకు భిన్నంగా ప్లాస్టిక్, కాంక్రీట్ వాడకుండా సహజ సిద్ధమైన వస్తువులను వినియోగించి తయారు చేశారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాయితో చేసిన రచ్చబండలు, వాకింగ్ ట్రాక్స్, సెక్యూరిటీ రూమ్స్, మధ్య మధ్యలో లాంగ్ బెంచీలు, గజిబో, యోగా సెంటర్, పిల్లల కోసం ప్రత్యేక ఆటస్థలం, పర్యావరణంపై సైన్ బోర్డులు, నీటి నిల్వలు, సౌరశక్తి వినియోగం, సేంద్రియ వ్యర్ధాల ఎరువుల వినియోగం వంటి నిర్మాణాలు చేపట్టారు. ఈ పార్క్ లో పక్షుల అందాలు కనువిందు చేయనున్నాయి. ఔషధ వనాల సువాసనలు, రంగురంగుల సీతాకోక చిలుకలకు ఈ పార్క్ వేదికైంది. ఇందులో అరుదైన వృక్ష సంపదను పెంచారు. శ్రీగంధం, మరి, రావి, ఉసిరి, చింత, వెదురు, నెమలీనారా, తెల్లమద్ది, సీతాఫలం, వేప , రేగు, రేలా, తునికి చెట్లను పెంచారు.
