- పేరెంట్స్ రెఫరెన్స్‌లేక బయోమెట్రిక్ రికార్డులు లేవు.. సర్టిఫికెట్లు రావు
- జగిత్యాల జిల్లాలో వందలాది ఆర్ఫన్ పిల్లలు
' జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ సెమీ ఆర్ఫన్ విద్యార్థి, అదే మండలానికి చెందిన మరో ఆర్ఫన్ బాలిక నెలలుగా ఆధార్ కోసం తిరుగుతున్నారు. అవసరమైన సర్టిఫికెట్లు లేకపోవడంతో వారి దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. గణేష్‌నగర్‌కు చెందిన ఓ ఆర్ఫన్ బాలుడికి స్కూల్ అడ్మిషన్ కోసం ఆధార్ తప్పనిసరి చేశారు. ఆధార్ కేంద్రానికి వెళ్లగా బయోమెట్రిక్ సమస్యలతో దరఖాస్తు రిజెక్ట్ అయింది. దీంతో చదువు మొదలుకాకముందే అతడి భవిష్యత్ అంధకారంలో పడింది.’
జగిత్యాల, వెలుగు: అమ్మానాన్నలు లేరు.. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదు.. తమ పేరుమీద గుర్తింపు కార్డు లేదు. కడుపు నింపేందుకు ఆశ్రయం దొరికినా.. చదువుకునేందుకు మాత్రం 'గుర్తింపు' అడ్డుగోడగా మారుతోంది. అధికారులు అనాథ పిల్లలకు అండగా ఉంటామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆధార్, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ లేక వందలాది మంది చిన్నారులు సంక్షేమ ఫలాలు, చదువులకు దూరమవుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్(ఒక పేరెంట్ఉన్నా నిరాదరణకు గురైనవారు) పిల్లల పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.
ప్రశ్నార్థకంగా అనాథ చిన్నారుల భవిష్యత్
జిల్లాలోని జగిత్యాల, రాయికల్, మల్యాల, కొడిమ్యాల, మెట్‌పల్లి, కథలాపూర్, గొల్లపల్లి, ధర్మపురి, సారంగాపూర్ మండలాల్లో ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ పిల్లల సంఖ్య అధికంగా ఉంది. తల్లిదండ్రులను కోల్పోయి వందల మంది బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందుతుండగా, అనాథ ఆశ్రమాల్లో 93 మంది చిన్నారులున్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 45 మందికి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉండగా, 48 మందికి లేవు. అలాగే 48 మందికి మాత్రమే ఇన్‌కమ్ సర్టిఫికెట్స్ ఉండగా, మిగిలిన వారికి అందలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆధార్ లేదనే కారణంతో ఏ చిన్నారికీ విద్యను నిరాకరించకూడదు.
కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. బడిలో చేరాలన్నా, హాస్టల్ సీటు పొందాలన్నా, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు అందుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి కాగా.. అనాథ ఆశ్రమాల్లో పెరుగుతున్న పిల్లల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ రికార్డులు లేవు. వారి గార్డియన్‌గా ఎవరిని పరిగణించాలనే విషయంలోనూ స్పష్టత లేదు. దీంతో ప్రతి దశలో టెక్నికల్ కారణాలతో దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి. ఆశ్రమాల ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ అన్ని శాఖలు వాటిని అంగీకరించకపోవడం మరో సమస్యగా మారింది. ఆధార్ నమోదు కోసం కేంద్రాలకు వెళ్తే డేట్ ఆఫ్ బర్త్, సంరక్షకుల వివరాలు అడుగుతున్నారు. ఇవి సరిగా లేకపోవడంతో దరఖాస్తులు పెండింగ్‌లో పడుతున్నాయి. కొంతమంది చిన్నారులకు పేరెంట్స్ రెఫరెన్స్ లేక బయోమెట్రిక్ సరిగా నమోదు చేయలేదు. దీంతో రిజెక్ట్ అవుతున్నాయి.
అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెడితేనే..
అనాథ పిల్లల సమస్యను పరిష్కరించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, ఆధార్ యంత్రాంగం సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ చొరవ తీసుకుని ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ డ్రైవ్‌లు నిర్వహించాల్సి ఉంది. డేట్ ఆఫ్ బర్త్ రికార్డులు లేని అనాథ చిన్నారులకు గెజిటెడ్ అధికారులు లేదా ఆశ్రమ నిర్వాహకుల ధ్రువీకరణ ఆధారంగా ఆధార్ జారీ చేసేలా నిబంధనల్లో సడలింపులు తీసుకురావాలని సూచిస్తున్నారు.
మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం
ఆర్ఫన్, సెమి ఆర్ఫన్‌లకు ఆధార్, ఇతర సర్టిఫికేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. ఇప్పటికే ఆశ్రమాల్లో ఉన్న విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందించేందుకు స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అందరికి సర్టిఫికేట్స్ అందజేసేలా పని చేస్తున్నాం.
భాస్కర్, డీడబ్ల్యూవో, జగిత్యాల
