కేసీఆర్ ఎక్కడ?..కీలక సమయంలో ఫాంహౌస్లో ఉన్నరేం: రేవంత్రెడ్డి

కేసీఆర్  ఎక్కడ?..కీలక సమయంలో ఫాంహౌస్లో ఉన్నరేం: రేవంత్రెడ్డి
  • ఇది తెలంగాణను అవమానించడం కాదా
  • ప్రతిపక్ష నాయకుడి సీట్లో పద్మారావు కూసున్నరు
  • ఆయనకు ఆ స్థానం అప్పగించడం కరెక్ట్
  • శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కృష్ణా జలాలపై కీలక చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలో లేకపోవడం తెలంగాణ  సమాజాన్ని అవమానించడమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఫాంహౌస్ లో ఉండడం కరెక్ట్ కాదన్నారు. ఆయన సీట్లో పద్మారావు కూర్చున్నారని, ఆయనకు ప్రతిపక్ష నేత పదవి అప్పగించి ఉంటే బాగుండేదని అన్నారు. ఆయన నిఖార్సయిన ఉద్యమ కారుడని ప్రశంసించారు.

తెలంగాణ సమాజానికి నీళ్లు ప్రాణ ప్రదమని, దక్షిణ తెలంగాణ జిల్లాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కరీంనగర్ నుంచి తరిమేస్తే పాలమూరుకు వచ్చారని, గెలిపిస్తే ఆ ప్రాంతానికి లబ్ధి చేకూర్చే కీలక చర్చ జరుగుతుంటే పత్తా లేకుండా పోయారని కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. ఇవాళ సభకు వచ్చి తెలంగాణ ఐక్యతను చాటాల్సిన ప్రతిపక్ష నేత ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.  

కృష్ణా నదీ జలాల్లో 68శాతం వాటాను తెలంగాణ ఇవ్వాలనే బిల్లు పెట్టామని, ఈ తీర్మానానికి మద్దతు పలికి మిగతా చర్చ చేయాలని అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

ఈఎన్సీ మురళీధర్ రావు తట్టాబుట్ట సర్ది పంపించాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

ఈఎన్సీ మురళీధర్ రావు బీఆర్ఎస్ ఏజెంట్ అని, రాష్ట్రానికి తీరని నష్టం చేశారనే తట్టా బుట్టా సర్ది పంపించామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు సభలో మాజీ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడిన  వీడియోను చూపించి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మురళీధర్ రావుతో అలా మాట్లాడించింది బీఆర్ఎస్ అని ఆరోపించారు.