- ఆయా కేంద్ర శాఖలతో సంప్రదింపులు జరపండి: సీఎస్ రామకృష్ణా రావు
- నెల రోజుల్లో పెండింగ్ నిధులు రాష్ట్ర ఖజానాకు చేర్చే బాధ్యత కార్యదర్శులదే
- ఈ నెల 28లోగా అద్దె భవనాల నుంచి ఆఫీసులన్నీ ఖాళీ చేయాలి
- విజన్ డాక్యుమెంట్ అమలుపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎస్ రామకృష్ణా రావు ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద దాదాపు రూ.4 వేల కోట్ల నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వీటి కోసం కేంద్ర సంబంధిత శాఖలతో వెంటనే సంప్రదింపులు జరపాలని సూచించారు. మరో నెల రోజుల్లోగా ఈ రూ.4 వేల కోట్ల నిధులు రాష్ట్ర ఖజానాకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కేంద్ర పథకాల అమల్లో వేగం పెంచి, తద్వారా రావాల్సిన నిధులను సకాలంలో రాబట్టే బాధ్యత కార్యదర్శులదేనని ఆయన స్పష్టం చేశారు. గురువారం సెక్రటేరియెట్‌లో అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా తెలంగాణ రైజింగ్ 2047 అమలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పురోగతిపై దిశానిర్దేశం చేశారు.
విజన్ డాక్యుమెంట్ అమలును సీరియస్‌గా తీసుకోండి..
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘రైజింగ్ తెలంగాణ–2047’విజన్ డాక్యుమెంట్ అమలుపై అధికారులు సీరియస్‌గా పనిచేయాలని సీఎస్ రామకృష్ణారావు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా యంత్రాంగం పనితీరు ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను కేవలం కాగితాలకే పరిమితం కాకూడదన్నారు.
ఈ విజన్ కోసం ప్రతి శాఖ తమ పరిధిలో సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. దీర్ఘకాలిక లక్ష్యాలే కాకుండా, ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రణాళికలు రూపొందించుకుని, అమలు చేయాలని సూచించారు.
28కల్లా అద్దే భవనాల్లో ఉండొద్దు..
అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆఫీసులు ఈ నెల 28లోపు ప్రభుత్వ సొంత భవనాల్లోకి మారాలని సీఎస్ గడువు విధించారు. ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీసులతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే కొలువుదీరాలన్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయో పరిశీలించి, భవనాలు లేనిచోట ప్రభుత్వ స్థలాలను గుర్తించి నూతన కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
