రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు

రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు

తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడేందుకు టీ. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోకర్ మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. జయశంకర్ సార్ గురించి రేవంత్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్, కేసీఆర్ కలిసి పని చేశారన్నారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు స్క్రిప్ట్ లో రేవంత్ రెడ్డి పాత్రదారుడు అయ్యాడని ఆరోపించారు. జయశంకర్ సార్ ను స్మరించుకోవడానికే ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టామన్నారు. 

దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రత్యామ్నాయం కోసం చాలా రాష్ట్రాలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని చెప్పారు. రైతు ఉద్యమంలో అమరులైన వారిని ఆదుకుంటుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు భయమెందుకని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ ను ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. హన్మకొండ క్యాంప్ కార్యాలయంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కామెంట్స్

టీ. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ లా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. జయశంకర్ స్వగ్రామానికి వెళ్లి సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య రచ్చ జరిగిందని సెటైర్ వేశారు. వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ఆరేళ్ల క్రితమే సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
ఓఆర్ఆర్ ప్రాజెక్టు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పేద రైతుల జీవితాలను ధ్వంసం చేయాలని చూస్తే.. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. జయశంకర్ సార్ సొంత గ్రామంలో అభివృద్ధి లేకపోవడం  పల్లె ప్రగతి డొల్లతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తోందని, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలపై ఆయన సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. 

‘ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా జయశంకర్ సార్ స్వగ్రామంలో అభివృద్ధి అనేది మచ్చుకైనా కానరావడం లేదు.. ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి ఊరు బాగుకోసం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయి.. ఆ ఊరిలో పరిస్థితులు చాలా ఆధ్వాన్నంగా ఉన్నాయి.. కనీస మౌలిక సదుపాయాలకు కూడా ఆ గ్రామం నోచుకోకపోవడం దురదృష్టకరం.. ఇప్పటికీ రెవెన్యూ విలేజ్ హోదా ఆ గ్రామానికి ఇవ్వకపోవడం అత్యంత విచారకరం..’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో సార్ పేరిట స్మృతి వనం నిర్మించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ఓఆర్ఆర్ ప్రాజెక్టు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోంది

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింపుపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఏమన్నారంటే..