పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింపుపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఏమన్నారంటే..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింపుపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఏమన్నారంటే..

ఇస్లామాబాద్‌ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడంపై పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. రష్యా నుంచి ఇంధనాన్ని రాయితీపై కొనుగోలు చేయాలనే భారత్‌ నిర్ణయాన్ని ఇమ్రాన్‌ కొనియాడారు. అమెరికా ఒత్తిడిని తట్టుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రష్యా చమురును రాయితీపై దిగుమతి చేసిందంటూ ట్వీట్‌ చేశారు.

‘క్వాడ్‌లో భారత్‌ సభ్య దేశం అయినప్పటికీ అమెరికా ఒత్తిడిని తట్టుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రష్యా నుంచి చమురును రాయితీతో దిగుమతి చేసిందని, భారత్‌ స్వతంత్ర విదేశాంగ విధానంలో పని చేస్తోంది’ అని ఇమ్రాన్‌ ఖాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించిన మీడియా కథనాన్ని ట్వీట్ కు జత చేశారు. గతంలో పాకిస్తాన్‌లో తమ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రజల ప్రయోజనాల కోసమే కృషి చేసిందని ప్రస్తావించారు. అధికారంలో ఉండగా భారత్ పై అర్ధరహిత ఆరోపణలు చేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..పదవీ నుంచి దిగిపోయాక ప్రశంసలు కురిపిస్తున్నారు.

పాకిస్తాన్‌ ప్రస్తుత ప్రభుత్వంపై ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని మండిపడ్డారు. పాక్‌ ఆర్థిక వ్యవస్థ తలాతోక లేని కోడిలా నడుస్తోందని, షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంలోని మీర్‌ జాఫర్లు, మీర్‌ సాదిక్‌లు బాహ్య దేశాల బలవంతపు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని విమర్శించారు. 

నిత్యావసరాల పెంపునకు, ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కేంద్రం కళ్లెం వేసింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ కూడా ప్రకటించారు. 

మరిన్ని వార్తల కోసం..

మరియుపోల్ సిటీని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాం

నరకానికి దారితీసే బావి.. గుట్టు తేలుస్తామంటున్న రీసెర్చర్లు