- 20 రోజులుగా మృత్యువుతో పోరాటం
- కూతురి చివరి చూపు కోసం స్వదేశానికి వస్తున్న తండ్రి
నర్సాపూర్(జి), వెలుగు: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)కు చెందిన ఓ బాలిక 20 రోజులుగా మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచింది. మండల కేంద్రానికి చెందిన గన్నారం దివ్యశ్రీ స్థానిక కేజీబీవీ స్కూల్లో అసిస్టెంట్ కుక్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె కూతురు శాన్విత(4) గత నెల 20న స్కూల్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి పప్పు పాత్రలో పడి తీవ్రంగా గాయపడింది.
దీంతో ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం బాలిక మృతిచెందింది. శాన్విత తండ్రి ధర్మరాజు బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితమే దుబాయ్ వెళ్లాడు. కూతురి మరణవార్త విన్న తండ్రి గుండెలవిసేలా ఏడుస్తూ ఆమె చివరి చూపు కోసం ఇంటికి వస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. దివ్యశ్రీ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.
