- రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసిరెడ్డి పల్లెలో విషాదం
చందుర్తి, వెలుగు: ఇంటి ముందు ఆడుకునే చిన్నారిని పాము కాటు వేయడంతో చనిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన చేకుట లత, రమేశ్దంపతులకు కొడుకు, కూతురు వేదాన్షి( ఏడాదిన్నర వయసు) ఉన్నారు. శనివారం సాయంత్రం చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఏడుపు వినిపించడంతో తల్లి వెళ్లి చూసింది.
చిన్నారి కాలి వేలి మధ్యలోంచి రక్తం కారుతుండగా, ఏదో పురుగు కుట్టిందనుకుని వేములవాడ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు పరీక్షించి చిన్నారి కండీషన్ సీరియస్ గా ఉందని చెప్పారు. మెరుగైన వైద్యానికి ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి మృతి చెందింది. తండ్రి రమేశ్ఆరునెలల కింద ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తను వచ్చే వరకు అంత్యక్రియలు చేయొద్దని అతను చెప్పడంతో చిన్నారి డెడ్ బాడీని ఫ్రీజర్ లో ఉంచారు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు చందుర్తి ఎస్ఐ రమేశ్ తెలిపారు.
