నాన్న కోసం రోడ్డు మీదకు వెళ్లి.. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

నాన్న కోసం రోడ్డు మీదకు వెళ్లి..  స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
  •     హబ్సిగూడలో విషాద ఘటన
  •     డ్రైవర్, అతడి అసిస్టెంట్ అరెస్ట్   

సికింద్రాబాద్, వెలుగు :   కొడుకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లగా.. వెనకే రోడ్డు మీదకు వచ్చిన ఏడాదిన్నర బిడ్డ అదే బస్సు కింద పడి మరణించిన హృదయ విదారక ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన మిథున్ భార్యాపిల్లలతో కలిసి  ఆరేండ్లుగా హబ్సిగూడలో ఉంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వారికి కొడుకు, బిడ్డ ఉన్నారు. మిథున్ కొడుకు సమీపంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు.

 రోజూలాగే గురువారం ఉదయం కూడా అతడిని స్కూల్ బస్సు ఎక్కించాడు. తాము వారం పాటు కేరళకు వెళ్తున్నామని, తమ కొడుకును పికప్ చేసుకునేందుకు రావాల్సిన అవసరం లేదని బస్సు డ్రైవర్ కు చెప్పాడు. ఇంతలో ఇంట్లో కేర్ టేకర్ వద్ద ఉన్న మిథున్ బిడ్డ జావ్లానా మిథున్ (1.7 ఏండ్లు) నాన్న కోసమని రోడ్డుపైకి వచ్చి బస్సు ముందు భాగం వద్ద నిలబడింది. పాపను గమనించని డ్రైవర్ మహమ్మద్ ఇంతియాజ్(40) బస్సును ముందుకుపోనివ్వడంతో ఆమె బస్సు ముందు టైర్ తగిలి కిందపడింది. 

చిన్నారి మీదుగా బస్సు వెనక టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అప్పటిదాకా ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ బస్సు టైర్ల కింద నలిగిపోవడంతో మిథున్ దంపతులు భోరున విలపించారు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ తోపాటు అతడి అసిస్టెంట్ ను అరెస్ట్ చేశారు.   

స్కూల్ ఎదుట ఏబీవీపీ నేతల ధర్నా 

చిన్నారి మృతికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ఏబీవీపీ నాయకులు హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నారిని పొట్టన పెట్టుకున్న డ్రైవర్ ను, స్కూల్ యాజమాన్యాన్ని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా.. నైపుణ్యం లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ స్కూలు యాజమాన్యం చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని వారు మండిపడ్డారు. జాన్సన్ గ్రామర్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాసేపటికి ఏబీవీపీ నాయకులు స్కూల్ లోపలికి దూసుకెళ్లారు. దీంతో ఓయూ పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ధర్నాలో విద్యార్థి నాయకులు పృథ్వీతేజ, సరాజు సాయి, దృహన్, గణేష్ సాగర్, శివ శంకర్, విక్రమాదిత్య, తదితరులు పాల్గొన్నారు.