చిన్నారి గుండెకు రంధ్రం..సర్జరీ కోసం సాయం చేయాలని విజ్ఞప్తి

చిన్నారి గుండెకు రంధ్రం..సర్జరీ కోసం సాయం చేయాలని విజ్ఞప్తి

హన్వాడ, వెలుగు : పొద్దస్తమానం పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబంలో చిన్నారి గుండెకు రంధ్రం పడి అనారోగ్యం పాలైంది. సాయం చేయాలని దాతలకు బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తున్నది. మహబూబ్ నగర్  జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్, అనురాధ దంపతులకు కీర్తన జన్మించింది. ఒక ఏడాది పాటు తల్లిదండ్రులు చిన్నారితో సంతోషంగా గడిపారు. మొదట చిన్నారికి న్యుమోనియా వచ్చిందని మహబూబ్ నగర్ లో సిరి చిల్డ్రన్స్  హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అక్కడ ఈసీజీ చేశారు. గుండెకు సంబంధించిన సమస్య ఉందని చెప్పడంతో జిల్లా కేంద్రంలోనే మల్లిక హార్ట్ హాస్పిటల్ లో చూయించారు. డాక్టర్లు పరీక్షించి చిన్నారి గుండెకు రంధ్రం పడిందని హైదరాబాద్ లోని రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కి రెఫర్  చేశారు. పాప గుండెకు రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పారు. 

అందుకు సర్జరీ చేయాలని, రూ.లక్ష ఖర్చవుతుందన్నారు. అప్పటికే వారు ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ.లక్ష అప్పు చేశారు. ప్రస్తుతం చలికాలం మొదలవ్వడంతో న్యుమోనియా మొదలయ్యి గుండె సమస్య ఎక్కువవడంతో ఆపరేషన్  చేయించుకోలేక ఆ చిన్నారిని చూసి తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. రూ.లక్ష పెట్టి తమ చిన్నారికి ఆపరేషన్  చేయించుకోలేని దుర్భరమైన పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని  కోరుతున్నారు. సహాయం చేయాలనుకునేవారు మొబైల్  90301 20458 నంబర్ కు లేదా  73205 208960  నంబర్ కు కాల్  చేయాలని విజ్ఞప్తి చేశారు.