వైరల్ ఫీవర్లతో అల్లాడిపోతున్న చిన్నారులు

వైరల్ ఫీవర్లతో అల్లాడిపోతున్న చిన్నారులు
  • హెచ్3ఎన్2 లక్షణాలతో పెరుగుతున్న కేసులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: చిన్నారులు వైరల్​ఫీవర్లతో అల్లాడిపోతున్నారు. దగ్గు, హై ఫీవర్, జలుబు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో సర్కార్, ప్రైవేట్​హాస్పిటల్స్​నిండిపోతున్నాయి. కొత్త వైరస్​హెచ్3 ఎన్2 లక్షణాలతో చిన్నారులు బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. చిన్నారులను హాస్పిటళ్లకు తీసుకెళ్లగానే ఇదే అదనుగా భావించి మెడిసిన్స్​దండిగా రాస్తూ కొందరు ప్రైవేట్​డాక్టర్లు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన మాతా, శిశు సంరక్షణ(ఎంసీహెచ్)లో డాక్టర్లు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. వెంటిలేటర్లు లేక ఎమర్జెన్సీ టైంలో నీలోఫర్​కు రిఫర్​చేస్తున్నారు. 

మంత్రి మాటలు నీటి మూటలే..

జిల్లా కేంద్రంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని గతేడాది జనవరి 29న ప్రారంభించారు. అప్పుడు అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేశామని హెల్త్​మినిష్టర్​హరీశ్​రావు చెప్పారు. ఇది జరిగి ఏడాది దాటినా హాస్పిటల్​లో వెంటిలేటర్ల జాడే లేదు. దీంతో అత్యవసరమైతే పిల్లలను హైదరాబాద్ లోని నీలోఫర్​కు రిఫర్​ చేస్తున్నారు. వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామని హెల్త్​మినిష్టర్ చెప్పిన మాటలు నీటి మూటలుగానే మారాయి. జిల్లాలో ఫ్లూ, ఎడిన్, హెచ్3ఎన్2 వైరస్​లక్షణాలతో పిల్లలు అల్లాడుతున్నారు. ఎంసీహెచ్​లో వెంటిలేటర్లు, వైద్యులు, సిబ్బంది లేక ప్రతి నెలా ఆరు నుంచి ఎనిమింది వరకు కేసులను నీలోఫర్​కు రిఫర్​చేస్తున్నారు. ఇదిలా ఉండగా రోజురోజుకు వైరల్​జ్వరాలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఇల్లెందు, బూర్గంపహాడ్, మణుగూరు, అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల వైద్యులు లేరు. దీంతో ఎంసీహెచ్ కు గతంలో కంటే చిల్ట్రన్స్​ఓపీ బాగా పెరిగింది. గతంలో 35 ఉండగా ప్రస్తుతం 100 వరకు పెరిగింది. 

వైద్యులు లేక ప్రైవేట్ కు క్యూ..

ఎంసీహెచ్​లో పీడియాట్రిక్​విభాగానికి15 నుంచి 20 డాక్టర్లు ఉండాలి. కేవలం ఐదుగురితోనే నెట్టుకొస్తున్నారు. సిబ్బంది కూడా కేవలం తొమ్మిది మందే ఉన్నారు. దీంతో రోగులు ప్రైవేట్​హాస్పిటల్స్ బాట పడుతున్నారు. కొత్తగూడెంతోపాటు పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లోని ప్రైవేట్ హాస్పిటల్స్​రోగులతో నిండిపోతున్నాయి. ఖమ్మంలోని కార్పొరేట్​హాస్పిటల్స్​తో కుమ్ముక్కైన పలువురు ఆర్ఎంపీలు అయినదానికి కానిదానికి రిఫర్ చేస్తున్నారు. దీంతో అప్పులు చేసి రూ.వేలల్లో డబ్బులను వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారు. 

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. 

రోజు రోజుకు వైరల్​ఫీవర్​రోగుల సంఖ్య పెరుగుతోందని పలువురు చిన్నపిల్లల డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం వస్తే నాలుగైదు రోజులు తగ్గడం లేదంటున్నారు. పిల్లలతోపాటు ఇంట్లోని వారూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, జన సమర్థం ఉన్న ప్రాంతంలో మాస్క్​లు ధరించడం, ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ కు పిల్లలను దూరంగా ఉంచడం, పబ్లిక్​ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు పిల్లలను తీసుకెళ్లకపోవడం మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు.