చిలీలో కార్చిచ్చు భీభత్సం : 18 మంది మృతి, వేల ఇళ్లులు బుగ్గి..

చిలీలో కార్చిచ్చు భీభత్సం : 18 మంది మృతి, వేల ఇళ్లులు బుగ్గి..

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఆదివారం దేశంలోని సెంట్రల్ & దక్షిణ ప్రాంతాల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో వేలాది మంది  ఇళ్లను వదిలి ప్రాణాలతో బయటపడాల్సి వచ్చింది. అంతేకాదు వేలాది ఎకరాల అడవి మంటల్లో కాలిపోయింది.

​ప్రస్తుతం చిలీలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 38 డిగ్రీల కంటే పైగా  ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీనికి తోడు బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలను అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది.

​చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించారు. ​మంటలను ఆర్పడానికి సైన్యాన్ని కూడా రంగంలోకి దింపారు. ఇప్పటివరకు దాదాపు 21 వేల ఎకరాల అటవీ ప్రాంతం కాలిపోగా... సుమారు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read : తెలంగాణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముంబైలో తగలబడింది

​మంటలు ఊర్లను చుట్టుముడుతున్నా ప్రభుత్వం వెంటనే స్పందించలేదని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. పెన్కో పట్టణ మేయర్ రోడ్రిగో వెరా మాట్లాడుతూ.. నాలుగు గంటలుగా నా కళ్ల ముందే ఊరు కాలిపోతోంది, కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి చర్య  లేదు. సైన్యం వస్తుందని ఫోన్లలో చెప్పడమే తప్ప, ఇక్కడికి ఎవరూ రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
​మంటలు అంత వేగంగా వస్తాయని ఎవరూ ఊహించలేదు. చాలామంది  ఇళ్లలోనే ఉండిపోయారు. మంటలు అడవి అంచునే ఆగిపోతాయని అనుకున్నాం, కానీ అవి ఊహించని విధంగా ఊరిని చుట్టేశాయి అని స్థానికులు చెబుతున్నారు. ఊహించని విధంగా ఒక ప్రాంతంలోనే 253 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పొలాలు, రోడ్లు, కార్లు, బడులు, చర్చిలు అన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి.