షాకింగ్.. వెరీ షాకింగ్ ఇన్సిడెంట్. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. మహారాష్ట్ర రాష్ట్రంలో తగలబడింది. బస్సు మొత్తం మంటల్లో కాలి బూడిద అయ్యింది. జగిత్యాలకు చెందిన వీనస్ ట్రావెల్స్ కు చెందిన ఏసీ బస్సు.. మహారాష్ట్ర వెళుతుంది.
బోరువెల్లి ప్రాంతం దగ్గరకు వెళ్లగానే.. బస్సు వెనక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును రోడ్డున పక్కన ఆపేసి.. బస్సులోని ప్రయాణికులను కిందకు దింపాడు. చూస్తుండగానే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. నడిరోడ్డుపై బస్సు పూర్తిగా తగలబడిపోయింది.
స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది స్పాట్ కు వచ్చి.. మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు ట్రావెల్స్ యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయనేది ప్రాథమిక సమాచారం. జగిత్యాలకు చెందిన వీనస్ ట్రావెల్స్ ఏసీ బస్సు.. జగిత్యాల నుంచే బయలుదేరింది.
ఈ ఘటన 2026, జనవరి 20వ తేదీ ఉదయం జరిగింది. ప్రమాదం విషయం తెలిసి జగిత్యాలలోని ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటం.. అందరూ సురక్షితంగా ఉన్నారన్న సమాచారంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
