బ్లాక్​ మార్కెట్.. రూ.600 ప్యాకెట్​కు రూ.1200

 బ్లాక్​ మార్కెట్.. రూ.600 ప్యాకెట్​కు రూ.1200

మిర్చి విత్తనాల  కోసం ఖమ్మం గాంధీచౌక్​లోని సీడ్స్​ షాపుల దగ్గర సోమవారం రైతులు బారులు తీరారు.  గంటల కొద్ది నిలబడి విత్తనాలు కొనుగోలు చేశారు. ఒక్కసారిగా రైతులు ఎక్కువమంది తరలిరావడంతో ఈ ప్రాంతంలో  ట్రాఫిక్​కు అంతరాయమేర్పడింది. మహిళా రైతులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయకపోవడంతో వారు కూడా ఇబ్బంది పడ్డారు. తాము ఆశించిన రకం విత్తనాలు మార్కెట్​లో లేకపోవడంతో రైతులు నిరాశచెందారు.
విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నాం..
పొద్దునొచ్చి లైన్​లో నిలబడ్డం. కావాల్సిన  విత్తనాలు దొరకలేదు. షాపుల దగ్గర ఆడవాళ్లకు సెపరేట్​ లైను లేక  మగవాళ్లతోపాటే నిలడాల్సివచ్చింది. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో చాలా దూరం నుంచి వచ్చిన ఆడవాళ్లం  ఇబ్బంది పడ్డాం. దుకాణాల దగ్గర కరోనా రూల్స్​ కూడా  పాటించలేదు. 
                                                                                                                                     – రమాదేవి, మహిళా రైతు, లచ్చగూడెం, చింతకాని మండలం 
బ్లాక్​లో అమ్ముతున్నరు 
ఎక్కువ దిగుబడి వచ్చే రకాల సీడ్స్​ను  రైతులకు ఇవ్వకుండా  బ్లాక్ మార్కెట్​లో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. కోరుతున్న విత్తనాలు అడిగినన్ని ఇవ్వడంలేదు. రెండు మూడు రకాల  సీడ్​ దొరకట్లేదు. సీజన్​ ప్రారంభం కావడంతో విత్తనాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. 
                                                                                                                                   - కన్నెగంటి మాధవరావు,  రైతు, గణేశ్వరం, రఘునాథపాలెం మండలం

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఖమ్మం, కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో మిర్చి సీడ్​ను వ్యాపారులు బ్లాక్​మార్కెటింగ్ చేస్తున్నారు. అధిక దిగుబడులు ఇచ్చే యసెశ్వనీ, 2222, ఆర్మోర్​ తదితర తేజా రకం మిర్చి విత్తనాలకు మార్కెట్​లో ప్రస్తుతం అధిక డిమాండ్​ఉంది. వీటి కోసం రైతులు ఎగబడుతుండడంతో సీడ్​ మాఫియా క్యాష్​ చేసుకుంటోంది. ప్రతి ఎకరాకు సుమారు 15 విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ఆఫీసర్లు ప్రైవేట్​ షాపుల్లో  ఒక్కో రైతుకు ఐదు మాత్రమే ఇప్పిస్తున్నారు. దీంతో అన్నదాతలు బ్లాక్​ మార్కెట్​లో డబుల్​ రేట్లకు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. 
ఒక్కో రైతుకు పది ప్యాకెట్లే.. 
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన రైతులు వానకాలం సుమారు 9-0వేల నుంచి లక్ష ఎకరాల్లో మిర్చి పంట సాగుచేస్తారు. ప్రస్తుతం సీజన్​ ప్రారంభమైనందున నార్లు పోసుకునేందుకు కావాల్సిన విత్తనాల వేటలో పడ్డారు. కానీ ప్రభుత్వం సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. సర్కారు ఎలాగూ సబ్సిడీ విత్తనాలు సప్లై చేయట్లేదు. కనీసం కావాల్సినన్ని విత్తనాలను ప్రైవేట్​గానైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోలేదు.  ముఖ్యంగా అధికదిగుబడులు ఇచ్చే యసెశ్వనీ, 2222, ఆర్మోర్​ తదితర తేజా రకం మిర్చి వంగడాలకు ఇప్పుడు మంచి డిమాండ్​ ఉంది. ఈ సీడ్​ కోసం రైతులు పొద్దున్నే ఫర్టిలైజర్​ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. అందరూ ఈ బ్రాండెడ్​ విత్తనాల కోసం ఎగబడుతుండడంతో వ్యాపారులు బ్లాక్​ చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో ఆఫీసర్లు ప్రతి రైతుకు 5 ప్యాకెట్లు బ్రాండెడ్​, ఐదు ప్యాకెట్లు ఇతర కంపెనీల విత్తనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 
రూ.600 ప్యాకెట్​కు రూ.1200
ప్రతి ఎకరాకు సుమారు 10 గ్రాముల వెయిట్​ ఉన్న 15 ప్యాకెట్లు అవసరముంటాయని రైతులు చెబుతున్నారు. కానీ ప్రైవేట్​గా ఒక్కో పాస్​బుక్​పై కేవలం  బ్రాండెడ్​5, అన్​బ్రాండెడ్​5 చొప్పున కేవలం 10 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ విత్తనాలు ఎకరానికి కూడా సరిపోవు. దీంతో రైతులు  యసెశ్వనీ, 2222, ఆర్మోర్​ లాంటి విత్తనాలను బ్లాక్​లో కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్ల ధర పది గ్రాములకు రూ.600 ఉండగా బ్లాక్​లో రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. షాపుల వద్ద ప్రత్యేకంగా నియమించుకుంటున్న  వ్యక్తులతో పాటు కంపెనీల ఏజెంట్లు ఈ దందాతో రైతులను దోచుకుంటున్నారు.  అగ్రికల్చర్​ ఆఫీసర్లు, పోలీసుల నామమాత్రపు పర్యవేక్షణ వల్ల ఈ బ్లాక్​ మార్కెట్​దందా సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం సీజన్​ ప్రారంభమైనందున వెంటనే అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు బ్లాక్​మార్కెటింగ్​ దందాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.