బృందావనం 163 ఎకరాల్లో 55వేల మొక్కలు

బృందావనం 163 ఎకరాల్లో 55వేల మొక్కలు
  • పండ్లు, ఔషధ, టింబర్​ జాతులకు ప్రాధాన్యత
  • పర్యావరణంపై అవగాహనకు ఈఈసీ ఏర్పాటు
  • పిల్లల కోసం బోటింగ్, సౌక్లింగ్​పాత్​లు
  • రూ.2 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎకో పార్క్​

ములుగు, వెలుగు : ములుగు జిల్లా అంటేనే ప్రకృతి అందాలు, పర్యాటక కేంద్రాలకు పెట్టింది పేరు. అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో మరో బృందావనంలాంటి ఎకో పార్కును ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో 163 హైవేకు ఆనుకుని ఇంచర్ల పరిధిలో 163 ఎకరాల్లో ఈ పార్క్​ను నిర్మిస్తున్నారు. రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. 

ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద ఎకో పార్క్​.. 

రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో ఎకో పార్క్​ నిర్మాణం చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో 163 ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణ హితంగా పార్క్​ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 55 వేల మొక్కలను నాటుతున్నారు. పండ్లు, ఔషధం, టింబర్​ మొక్కలు ఉన్నాయి. ఉసిరి, మర్రి, ఇప్ప, నేరేడు, మారేడు, జమ్మి, వేప, టేకు, మద్ది, ఎగిస, వెదురు తదితర మొక్కల రకాలను నాటేందుకు చర్యలు చేపట్టారు. 163 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్​ ఏర్పాటు చేయడంతోపాటు స్వాగత తోరణం నిర్మాణం పూర్తయ్యింది. ఎకో పార్క్​ను స్కై వ్యూ చూసేందుకు వాచ్​టవర్​ను ఏర్పాటు చేశారు. 

చిల్డ్రన్స్​ కోసం పార్కు, బోటింగ్.. 

పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులను అమర్చేందుకు ప్లాన్​చేశారు. జంపింగ్, ఉయ్యాలలు, జారుడు బండలు, పుల్​అప్స్, రింగ్స్ ఇలా ఎన్నో పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు సైక్లింగ్​చేసేందుకు ప్రత్యేక పాత్ ను ఏర్పాటు చేయగా, ఇప్పటికే ఈ పాత్ లో పలువురు స్పెషల్ బెటాలియన్​ సిబ్బంది వాకింగ్, సైక్లింగ్​చేస్తున్నారు. పార్కులో బోటింగ్, ఓపెన్​జిమ్​ఏర్పాటుకు చేస్తున్నారు.

ఎన్విరాన్​మెంటల్​ ఎడ్యుకేషన్​సెంటర్​.. 

ఎకో పార్కులో ఆహ్లాదంతోపాటు ఎడ్యుకేషన్​ కూడా ఇవ్వనున్నారు. ఎన్విరాన్​మెంటల్​ఎడ్యుకేషన్​సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నట్లు రేంజ్అధికారి శంకర్​ తెలిపారు. పర్యావరణం, మొక్కల రకాలు, జాతులు, ప్రకృతికి మేలు చేసేందుకు ప్రజలు చేపట్టాల్సిన అంశాలు, అటవీ సంపద, చెట్ల రకాలు, ప్రాముఖ్యత, జీవవైవిద్యం, పర్యావరణానికి కలిగే నష్టాలు, జంతువులు, పక్షులు, ఇలా ఎన్నో ప్రత్యేకతలను తెలియజేసేలా ఈఈసీని తీర్చిదిద్దనున్నారు. 

మెడిటేషన్, ఓపెన్​ మీటింగ్​కు కూడా వసతులు కల్పిస్తున్నారు. ఎకో పార్క్ లో ఓ వైపు స్మృతి వనం ఏర్పాటు చేసి ప్రజలు మొక్కలు నాటే వారి జ్ఞాపకాలను ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్కు స్థలంలో కొన్నిచోట్ల చెక్​ డ్యాంలు నిర్మించి సుందరంగా తీర్చిదిద్దనున్నారు. పిల్లలు బోటింగ్​ చేసేందుకు, నీటి సంపుల్లో, చెక్​ డ్యాంలలో తెలుపు, నలుపు రకాల పక్షులను ఉంచనున్నారు.

అదేవిధంగా 8 రకాల తామర పువ్వులను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల వన మహోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క ఎకో పార్కులో మొక్కలు నాటి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ ఎకో పార్కు మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నది. 

నేచర్​ లవర్స్ కు ఇక్కడ మరుపురాని జ్ఞాపకాలు.. 

ములుగు జిల్లా నేచర్​ గ్రీనరీతో మమేకమై ఉంటుంది. దానిని కాపాడుకోవడంతోపాటు ప్రజలకు ప్రకృతిపై అవగాహన కల్పించడం ఉద్దేశం. రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఎకో పార్కు ద్వారా ప్రకృతి ప్రేమికులు కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదం, ఆనందాన్ని పొందుతారు. ఎన్విరాన్​మెంటల్ ఎడ్యుకేషన్​ సెంటర్​ ద్వారా గ్రూపులుగా వచ్చే విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. స్మృతి వనాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.  -  రాహుల్​ కిషన్​ జాదవ్​, జిల్లా అటవీ శాఖ అధికారి, ములుగు