
- రాజేందర్రెడ్డి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యాడు : మంత్రి సురేఖ
- పూటకో పార్టీ మారితే ఐదోసారి ఎమ్మెల్యే అయ్యేటోన్ని : ఎమ్మెల్యే నాయిని
వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్‌లో అధికార పార్టీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. భద్రకాళి ఆలయంలో ధర్మకర్తల మండలి సభ్యుల నియామకం ఇద్దరి మధ్య మరోసారి గొడవకు కారణమైంది. గతంలోనే 12 మంది సభ్యులు, ఒక అర్చక ఎక్స్అఫీషియో మెంబర్‌తో ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పడగా.. ఇటీవల మరో ఇద్దరు కొత్త సభ్యులను నియమిస్తూ దేవాదాయశాఖ ఆఫీసర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు కొండా సురేఖ వర్గంగా భావించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి.. మంత్రి సురేఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ఆలయ అభివృద్ధి కోసం తాను పాటుపడుతుంటే కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని మంత్రిని ఉద్దేశించి రెండు రోజుల కింద మీడియాతో అన్నారు. నాయిని వ్యాఖ్యల విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు కొండా సురేఖ వద్ద ప్రస్తావించారు. దీంతో కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నాయిని రాజేందర్‌రెడ్డి నాకంటే చిన్నోడు.. ఎప్పటినుంచో ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు. ఏదో అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యాడు. అయినా నా శాఖ పరిధిలో ఇద్దరు ధర్మకర్తల కమిటీ సభ్యులను నియామకం చేసే అధికారం కూడా నాకు లేదా.. అయినా వారేమి మా వెంట తిరిగే అనుచరులు కాదు. సభ్యులకు ఎవరూ పేర్లు ఇవ్వకపోవడంతో.. పైనుంచి వచ్చిన ఇద్దరిని నియమించాల్సి వచ్చింది’ అని చెప్పారు. నాయిని రాజేందర్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
నా నియోజకవర్గంలో ఆమె పెత్తనం ఏంటి : నాయిని
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాయిని రాజేందర్‌రెడ్డి ఆదివారం స్పందించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్ల బృందం ఆదివారం ఇండోర్ పర్యటనకు వెళ్తుండడంతో రాజేందర్‌రెడ్డి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేఖ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను పూటకో పార్టీ మారితే ఐదోసారి ఎమ్మెల్యే అయ్యేటోన్ని.. 40 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న.. ఎన్‌ఏస్‌యూఐ ప్రెసిడెంట్ నుంచి ఎదిగి ఎమ్మెల్యేగా గెలిచా.. నా నియోజకవర్గంలో ఆమె పెత్తనం ఏంటి ? భద్రకాళి ఆలయ కమిటీలో ఎవరో ఇద్దరిని నియమించుకుంటే ఇబ్బంది ఉండేది కాదు, కానీ ఏడుగురిని వారి మనుషులనే నియమించుకొని, నా ముఖంపై నాలుగు వేయడం ఏంటి ? ఇదైనా నాకు కనీస సమాచారం ఇవ్వకుండా చేయడం ఏంటి?’ అని ప్రశ్నించారు. ఎవరి హద్దులో వారు ఉండి పనిచేస్తే ఇలాంటి సమస్యలు రావు, జిల్లాలోని అందరి నేతలతో విభేదాలు పడితే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. మొత్తంగా గ్రేటర్ వరంగల్‌లో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మధ్య మాటల యుద్ధం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.