డెప్సంగ్​ సెక్టర్‌‌లో చైనా ఆర్మీ కదలికలు

డెప్సంగ్​ సెక్టర్‌‌లో చైనా ఆర్మీ కదలికలు

న్యూఢిల్లీ:ఇండియా, చైనా బార్డర్​లో మరోసారి ఘర్షణ తప్పేలా లేదు.. మొన్న గల్వాన్​ లోయలో జరగగా, ఈసారి దౌలత్​ బేగ్​ ఓల్డీ(డీబీఓ), డెప్సంగ్​ సెక్టర్​లో ఘర్షణ జరిగే పరిస్థితి కనిపిస్తోందని మన ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఈ నెల మొదట్లో పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ) బలగాలు డెప్సంగ్​ సెక్టర్​ వైపు కదులుతున్నట్లు శాటిలైట్​ చిత్రాల ద్వారా వెల్లడైందని తెలిపాయి. 2013లో చైనా ఈ సెక్టార్​ను ఆక్రమించి, క్యాంపు ఏర్పాటు చేసుకుంది. మన దేశం ఒత్తిడి పెంచడంతో 2016 కన్నా ముందే క్యాంపును ఎత్తేసినట్లు తెలిపింది. తాజాగా ఈ ప్లేస్​లో క్యాంపులు, వెహికిల్స్ కదలికలను మన సైన్యం గుర్తించింది. చైనా దుర్మార్గాన్ని ముందే ఊహించిన మన సైన్యం.. గత నెలాఖరులోనే డెప్సంగ్​ సెక్టార్​ దిశగా బలగాలను పంపించింది. దీంతో అక్కడ కూడా గల్వాన్​ తరహా ఘర్షణ జరిగే అవకాశం ఉందని డిఫెన్స్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనా బుద్ధి మారలే..

గల్వాన్​ వ్యాలీలో ఘర్షణ తర్వాత కూడా చైనా తన బుద్ధి మార్చుకోలేదు. ఘర్షణ తర్వాత ఇరువైపులా నెలకొన్న టెన్షన్​ను తగ్గించేందుకు రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన మీటింగ్‌లో బార్డర్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పుకునేందుకు రెండు దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయి. ఓవైపు ఈ చర్చలు నడుస్తుండగానే చైనా మరో వైపు బార్డర్​ వెంట పెద్ద సంఖ్యలో బలగాలను మోహరిస్తోంది. దీంతో మన సైన్యం కూడా లైన్​ ఆఫ్​ యాక్చువల్​ కంట్రోల్​ వెంట రెడీగా ఉంది.

గల్వాన్​ వ్యాలీలో కూడా..

గల్వాన్​లో బలగాలను వెనక్కు తీసుకోవడానికి ఒప్పుకున్నట్లే ఒప్పుకున్న చైనా.. అదే టైంలో ఎల్ఏసీ వెంట పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించింది. లేటెస్ట్​గా హైరిజల్యూషన్​తో తీసిన శాటిలైట్​ఫొటోల్లో పెట్రోల్​ పాయింట్​14 వద్ద భారీ వాహనాలు, టెంట్లను గుర్తించినట్లు డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 15న ఘర్షణ జరిగిన ప్రాంతంలో చైనా సైనికులు క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారని రిటైర్డ్​ మేజర్​ జనరల్​ రమేశ్​ పాఢి చెప్పారు. ఈ నెల 16 వ తేదీకి ముందు తీసిన శాటిలైట్​ చిత్రాల్లో శిథిలాలు కనిపించాయని, ఆ తర్వాత తీసిన ఫొటోల్లో అక్కడ టెంట్లు, వెహికిల్స్ కనిపించాయన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం