పాక్ కంటే చైనాతోనే ఇండియాకు భారీ ముప్పు

పాక్ కంటే చైనాతోనే ఇండియాకు భారీ ముప్పు

ముంబై: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కంటే చైనాతోనే ఇండియాకు భారీ ముప్పు పొంచి ఉందన్నారు. చైనా మిలటరీ ఇండియా ఆర్మీ కంటే పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చునన్నారు. మనకు పొరుగున ఉన్న దేశాలను డ్రాగన్ తనవైపునకు తిప్పుకుంటోందని హెచ్చరించారు.

‘గల్వాన్ వివాదంపై రాజకీయాలు చేయడం సరికాదు. అప్పుడే మనం వారిపై దూకుడుగా వ్యవహరించగలం. కానీ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలంటే మాత్రం దేశం మొత్తం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిరసనలకు బదులు దౌత్యపరంగా చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడు నేపాల్‌కు వెళ్లారు. ఇండియాకు నేపాల్ మిత్ర దేశం అని పొగిడారు. కానీ నేపాల్ ఇప్పుడు చైనాకు మద్దతుగా ఉంది. చైనా మెళ్లిగా మన మిత్ర దేశాలను తన వైపునకు తిప్పుకుంటోంది’ అని పవార్ పేర్కొన్నారు.