అమెరికా ఎన్నికల్లో విజేతగా ప్రకటించిన దాదాపు వారం రోజుల తరువాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ను చైనా అభినందించింది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా – చైనా దేశాల మధ్య వివాదాలు తలెత్తాయి. నాలుగు దశాబ్ధాలుగా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పటికి ట్రంప్ తీరుతో అవి బెడిసి కొట్టాయి. ముఖ్యంగా కరోనా క్రైసిస్ లో చైనాపై ట్రంప్ చేసిన విమర్శలపై డ్రాగన్ కంట్రీకి మన:శాంతిని లేకుండా చేశాయి. అయితే తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడం..,వచ్చే ఏడాది జనవరిలో జో బైడన్ ప్రమాణస్వీకారం చేయడంపై చైనా స్పందించింది. అమెరికన్ ప్రజల తీర్పును మేం గౌరవిస్తున్నాం. మిస్టర్ బైడెన్ మరియు శ్రీమతి హారిస్‌లకు మా అభినందనలు అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ శుభాకాంక్షలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురించి ప్రస్తావించారు.
కాగా గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ అభ్యర్ధి విజయం సాధించినా..,రష్యా,మెక్సికోలతో సహా కొన్ని ప్రధాన దేశాలు అభినందనలు తెలిపేవి కాదు. వాటిలో చైనా ఉంది. కానీ ఇప్పుడు బైడెన్ గెలిచినందుకు మిగిలిన దేశాలకంటే చైనా ముందుగానే విష్ చేయడం ఆసక్తికరంగా మారింది.
