కలిసి పని చేద్దాం.. ఇండియాకు చైనా పిలుపు

కలిసి పని చేద్దాం.. ఇండియాకు చైనా పిలుపు

బీజింగ్: మనతో బార్డర్​లో తరచూ గొడవలు పెట్టుకుంటున్న చైనా.. రెండు దేశాల మధ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండియాతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ‘‘రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఇండియాతో కలిసి పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. బార్డర్ లో స్టెబిలిటీ కోసం రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయి. ఇందుకోసం డిప్లమాటిక్, మిలటరీ లెవల్​లో చర్చలు జరుపుతున్నాయి” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. ఆదివారం బీజింగ్ లో ‘‘ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అండ్ చైనా ఫారిన్ రిలేషన్స్ ఇన్ 2022” అనే అంశంపై జరిగిన సింపోజియంలో ఆయన మాట్లాడారు. అమెరికా, రష్యా, ఇండియా తదితర దేశాలతో చైనా సంబంధాలపై వివరించారు. 

అమెరికాతో ఇబ్బందులున్నయ్.. 

రష్యాతో తమ సంబంధాలు మరింత బలపడ్డాయని వాంగ్ యీ చెప్పారు. పాకిస్తాన్ తోనూ రిలేషన్స్ బాగున్నాయని తెలిపారు. అమెరికాతో తమకు ఇబ్బందులున్నాయని అన్నారు. ‘‘అమెరికా మమ్మల్ని ప్రధాన పోటీదారుగా చూస్తోంది. అందుకే మమ్మల్ని అణచివేయాలని చూస్తోంది. రెచ్చగొడుతోంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. సంబంధాలను మెరుగుపరిచేందుకు సరైన దారులు వెతుకుతున్నాం” అని పేర్కొన్నారు. తైవాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికా బెదిరింపులకు తాము భయపడలేదన్నారు. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ తో కూడిన క్వాడ్ కూటమిని.. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్​తో కూడిన అకస్ కూటమిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తమ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ గ్రూపులను ఏర్పాటు చేశారని ఆరోపించారు.