లడక్ సెక్టార్‌లో సరిహద్దు వివాదం తర్వాత… చైనా వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇతర ప్రాంతాలవైపు బలగాలను మళ్లించింది. ఇటీవల ఉత్తరాఖండ్‌కు సమీపంలోని లిపులేక్ పాస్ దగ్గరకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) బలగాలు చేరుకున్నాయి. గత కొద్ది వారాలుగా ఇక్కడ చైనా సైనిక చర్యలు ఎక్కువైనట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు చైనా ఆర్మీ కదలికలపై భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు అదనపు బలగాలను పంపుతోంది. లిపులేక్‌తో పాటు, ఉత్తర సిక్కింలోని కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ చైనా కవ్వింపులకు పాల్పడే అవకాశం ఉందని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దాదాపు 1000 మంది సైనికులు సరిహద్దుకు సమీపంగా మోహరించాలన్నారు. లేటెస్టు పరిణామాలపై భారత ప్రభుత్వం అమెరికా, రష్యా, యూరప్ దౌత్య కార్యాలయాలను అలర్ట్ చేసింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సైనికులకు అవసరమైన దుస్తులు, మంచును తట్టుకునే టెంట్ల తయారీ సంస్థలతో సంప్రదించాలని, అత్యవసర కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని సూచించింది.
లిపులేక్ అమర్నాథ్ యాత్ర మార్గంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో 80 కిమీ పొడవున భారత్ చేపట్టిన రహదారి మార్గానికి నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. లిపులేక్ ప్రాంతంలో నివశించే ట్రైబల్ ప్రజలు జూన్-అక్టోబర్ మధ్య వస్తు మార్పిడి వార్షిక వ్యాపారం చేస్తుంటారు. లిపులేక్‌తో పాటు కాలాపానీని తమ భూభాగంగా తెలుపుతూ నేపాల్ కొత్తగా పొలిటికల్ మ్యాప్‌ను రూపొందించి వివాదానికి తెరలేపింది. లిపులేక్ అనేది ఇండియా-నేపాల్-చైనా సరిహద్దుల్లో కీలక ప్రాంతంగా ఉంది.

