హాంకాంగ్​ను దేశభక్తులే పాలించాలె :​ జిన్​పింగ్

హాంకాంగ్​ను దేశభక్తులే పాలించాలె :​ జిన్​పింగ్
  • చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభల్లో ప్రెసిడెంట్​ జిన్ పింగ్ 
  • చైనా రీయూనిఫికేషన్​ను సాధించి తీరుతాం 
  • క్వాడ్, ఆకస్ వంటి గ్రూపులకు చైనా వ్యతిరేకమని కామెంట్స్ 

బీజింగ్/తైపీ:  తైవాన్ ఎన్నటికైనా చైనాలో విలీనం కావాల్సిందేనని చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్​ తేల్చిచెప్పారు. విలీన ప్రాసెస్​ శాంతియుతంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేదిలేదని జిన్​పింగ్​ స్పష్టం చేశారు. ఆదివారం బీజింగ్ లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్  ది పీపుల్’ భవనంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ మహాసభల ప్రారంభం సందర్భంగా వేలాది మంది పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి జిన్ పింగ్ మాట్లాడారు. తైవాన్ సమస్యను పరిష్కరించుకోవడం చైనీస్ ప్రజల సొంత విషయమని, దీనిపై చైనీస్ ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు. ‘‘తైవాన్ ప్రజలను చైనా ఎప్పుడూ గౌరవించింది. కేర్ తీసుకుంది. వారి ప్రయోజనం కోసం ఆలోచించింది. తైవాన్ జలసంధి ద్వారా ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించింది కూడా.  తైవాన్​ను చైనాలో తిరిగి శాంతియుతంగా విలీనం చేసుకునేందుకు సిన్సియర్​గా ప్రయత్నిస్తున్నాం. కానీ బల ప్రయోగం చేయబోం అని మాత్రం ఎన్నటికీ ప్రామిస్ చేయలేం. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటున్న బయటి శక్తులు, తైవాన్​లోని అతికొద్ది మంది ఇండిపెండెన్స్ సపోర్టర్లు లక్ష్యంగానే ఈ ఆప్షన్ ను వినియోగించుకుంటాం. చైనా రీయూనిఫికేషన్​ను సాధించి తీరుతాం” అని ప్రతినిధుల చప్పట్ల మధ్య జిన్ పింగ్ ప్రకటించారు. 

హాంగ్ కాంగ్ ను చక్కదిద్దినం 

ఎప్పుడూ ఆందోళనలతో గందరగోళంగా ఉండే హాంకాంగ్​ను తాము విజయవంతంగా పరిపాలన వైపు మళ్లించామని జిన్ పింగ్ అన్నారు. హాంకాంగ్​కు అటానమీతో కూడిన ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’ విధానమే సరైనదన్నారు. దీర్ఘకాలంపాటు దీనికే కట్టుబడి ఉండాలన్నారు. హాంకాంగ్​ను దేశభక్తులే పాలించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో కలిసి ఉండేందుకు హాంకాంగ్​కు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తామని చెప్పారు. 

గ్రూపులకు వ్యతిరేకం

యూఎన్​, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ భద్రతకు చైనా కట్టుబడి ఉంటుందని జిన్ పింగ్ అన్నారు. అయితే, చైనాకు వ్యతిరేకంగా ఏకపక్షంగా ఏర్పాటయ్యే గ్రూపులను మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాతో కూడిన ఆకస్ కూటములను ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ కామెంట్ చేశారు. అయితే, అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇటు దక్షిణ చైనా సముద్రంలో వివిధ దేశాలతో వివాదాల వంటి విషయాలను మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఇక కరోనాను చైనా సమర్థంగా ఎదుర్కొన్నదని, అవినీతిని ఉక్కుపాదంతో అణచేశామని, దేశంలో తగ్గుతున్న బర్త్ రేట్​ను పెంచేందుకు కొత్త పాలసీలు తెస్తామన్నారు. కాగా, వారం రోజుల పాటు జరిగే ఈ జాతీయ మహాసభల్లో జిన్ పింగ్​ను మూడోసారి చైనా అధ్యక్షుడిగా పార్టీ ఎన్నుకోనుంది.

స్వేచ్ఛను వదులుకోం.. వెనక్కి తగ్గం: తైవాన్ 

చైనాకు తాము ఎన్నటికీ తలవంచబోమని తైవాన్ స్పష్టం చేసింది. తమ దేశంలో తైవాన్ ను కలిపేసుకునేందుకు బల ప్రయోగానికీ వెనకాడబోమన్న జిన్ పింగ్ కామెంట్లపై తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ వెన్ ఆఫీసు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘తైవాన్ వైఖరి స్పష్టంగా ఉంది. దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యంపై రాజీ పడే, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. యుద్ధరంగంలో తలపడటం తైవాన్ జలసంధిలోని ఇరు పక్షాలకూ మంచిది కాదు. తైవాన్ ప్రజలందరూ ఏకాభిప్రాయంతో చెప్తున్న విషయం ఇదే” అని స్పష్టం చేసింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో జరుగుతున్న పరిణామాలను తాము గమనిస్తున్నామని పేర్కొంది. జిన్ పింగ్ ప్రతిసారీ తైవాన్ పై బల ప్రయోగం చేస్తామంటూ ప్రకటనలు చేయడానికి బదులు సొంత దేశంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాలంటూ బీజింగ్ లో ఇటీవల జరిగిన నిరసనలను ఉద్దేశిస్తూ తైవాన్ ప్రధాని సూ త్సేంజ్ చాంగ్ ఎద్దేవా చేశారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ గత ఆగస్టులో తైవాన్ లో పర్యటించిన తర్వాత తైవాన్ జలసంధిలో చైనా భారీ ఎత్తున మిలిటరీ డ్రిల్స్ ప్రారంభించడంతో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం (అక్టోబర్ 10) తైవాన్ నేషనల్ డే సందర్భంగా ఇచ్చిన స్పీచ్ లో ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ వెన్ మాట్లాడుతూ.. తైవాన్ మిలిటరీని మరింత పటిష్టం చేసుకుంటున్నామని అన్నారు. మరోవైపు చైనాతో 
చర్చలకు కూడా సిద్ధమన్నారు.