రష్యాతో మీ వ్యాపారం సంగతేంటి?..అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్పై చైనా ఫైర్

రష్యాతో మీ వ్యాపారం సంగతేంటి?..అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్పై చైనా ఫైర్

బీజింగ్: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ పై యుద్ధానికి ఇండియా, చైనా ఫండింగ్ చేస్తున్నాయన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కామెంట్లపై చైనా మండిపడింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని, దాని సంగతి ఏమిటని ప్రశ్నించింది. 

మంగళవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ చేసిన కామెంట్లను ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ బుధవారం బీజింగ్ లో మీడియా సమావేశంలో ఖండించారు. 

రష్యాతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతోపాటు యూరోపియన్ యూనియన్, అమెరికా కూడా వాణిజ్యం కొనసాగిస్తోందని, దాని సంగతేమిటని ప్రశ్నించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలన్నదే చైనా అభిప్రాయమని స్పష్టం చేశారు. 

డబ్ల్యూటీఓ రూల్స్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే తాము రష్యాతో వ్యాపారం చేస్తున్నామని, అంతేతప్ప ఏ దేశాన్నీ టార్గెట్ గా చేసుకోలేదన్నారు. రష్యన్ ఆయిల్ కొనుగోలును సాకుగా చూపుతూ అమెరికా తమపై ఏమైనా చర్యలు తీసుకుంటే.. తాము కూడా ప్రతి చర్యలు చేపడతామని హెచ్చరించారు. 

ట్రంప్ ఏమన్నారంటే.. 

యూఎన్ జీఏ సమావేశంలో ట్రంప్ మంగళవారం మాట్లాడుతూ.. ఇండియా, చైనా ఆయిల్ కొనుగోలు చేస్తూ రష్యాకు నిధులు సమకూరుస్తున్నాయని, ఉక్రెయిన్ లో కొనసాగుతున్న యుద్ధానికి ఆ రెండు దేశాలే కారణమని అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ కూడా ఇంధన దిగుమతులు చేసుకోవడంపై విమర్శలు గుప్పించారు.