స్పేస్​కు ముగ్గురు చైనా వ్యోమగాము​లు

స్పేస్​కు ముగ్గురు చైనా వ్యోమగాము​లు
  • స్పేస్​కు ముగ్గురు చైనా వ్యోమగాము​లు
  •  ‘షెంఝౌ–16’ మిషన్​లో సొంత స్పేస్ స్టేషన్​కు పంపిన డ్రాగన్ కంట్రీ
  •  తొలిసారి ఒక చైనీస్ పౌరుడు  కూడా స్పేస్​లోకి..

బీజింగ్: చైనా తన సొంత స్పేస్ స్టేషన్ ‘తియాంగాంగ్’కు మరో ముగ్గురు వ్యోమగాము​లను విజయవంతంగా పంపింది. మంగళవారం ఉదయం వాయవ్య చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్​గా చేపట్టినట్లు ‘చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఏ)’ వెల్లడించింది. ప్రయోగించిన పది నిమిషాలకు ముగ్గురు ఆస్ట్రోనాట్​లతో కూడిన షెంఝౌ–16 స్పేస్ షిప్​ను రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేర్చినట్లు తెలిపింది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ వద్దకు స్పేస్ షిప్ చేరుకుందని, ఆ తర్వాత తియాన్హే మాడ్యూల్ కు అనుసంధానం అయిందని సీఎంఎస్ఏ పేర్కొంది. తదుపరి దశలో స్పేస్ షిప్​లో ఉన్న ముగ్గురు ఆస్ట్రోనాట్​లు స్పేస్ స్టేషన్​లోకి వెళ్తారని.. గత నవంబర్ లో షెంఝౌ–15 మిషన్​లో వెళ్లి స్పేస్ స్టేషన్​లో ఉన్న ముగ్గురు ఆస్ట్రోనాట్​లు స్పేస్ షిప్​లోకి చేరుకుని, భూమికి తిరిగి వస్తారని వెల్లడించింది. కాగా, ప్రస్తుత మిషన్ లో స్పేస్ స్టేషన్​కు పంపిన ముగ్గురు ఆస్ట్రోనాట్​లలో బీహాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గూ హయిచావో పేలోడ్ స్పెషలిస్ట్​గా వెళ్లారని సీఎంఎస్ఏ తెలిపింది. మిగతా ఇద్దరిలో జింగ్ హయిపెంగ్ మిషన్ కమాండర్​గా, ఝూ యాంగ్జూ ఫ్లైట్ ఇంజనీర్​గా పనిచేస్తారని పేర్కొంది. వీరు ముగ్గురు కూడా 5 నెలలపాటు స్పేస్ స్టేషన్​లో పలు ప్రయోగాలు చేపట్టిన తర్వాత భూమికి తిరిగి వస్తారని వివరించింది.