నెలసరి నొప్పిని ఓడించలేక..

నెలసరి నొప్పిని ఓడించలేక..

‘ఇది అమ్మాయిలకు సంబంధించిన సమస్య. మొదటి రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్పోర్ట్స్ ఆడేటప్పుడు మరింత నొప్పి ఉంటుంది. నేను అబ్బాయినైతే బాగుండేది. ఇలాంటి నొప్పి ఉండేది కాదు.’ ఈ మధ్య జరిగిన టెన్నిస్‌‌ టోర్నమెంట్‌‌ ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ నుంచి వెనుదిరిగాక.. చైనా  టెన్నిస్ ప్లేయర్​ జెంగ్​ కిన్వెన్​ చెప్పిన మాటలివి. 

విపరీతమైన కడుపునొప్పి.. పొత్తి కడుపు మెలిపెడుతుంటుంది..నడుమంతా పట్టేసినట్లు అవుతుంది..కాళ్ళ తిమ్మిర్లు.. తీవ్ర రక్త స్రావం.. మూడ్​ స్వింగ్స్​.. ఇవన్నీ నెలనెలా పిరియడ్స్​ టైంలో దాదాపుగా అందరు ఆడవాళ్లు ఎదుర్కొనేవే. అయితే కొందరిలో మాత్రం ఈ నెలసరి నొప్పులు భరించలేనంతగా ఉంటాయి. అడుగు తీసి అడుగేయడానికి కూడా శరీరం సహకరించదు. ఈ పరిస్థితినే పిరియడ్​ క్రాంప్స్​ అంటారు. టీనేజర్స్​లో ఎక్కువగా కనిపించే  ఈ సమస్యకి కారణాలేంటి? ఈ నొప్పుల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాల గురించి గైనకాలజిస్ట్​ రజిని ఇలా వివరించారు. 

నెలసరిలో వచ్చే నొప్పులనే పిరియడ్​​ క్రాంప్స్​ అంటారు. మెడికల్​ భాషలో   డిస్మెనోరియా అని పిలుస్తారు. కొందరిలో ఈ క్రాంప్స్​ చాలా మైల్డ్​గా ఉంటాయి. ఇంకొందరిని మాత్రం భరించలేనంతగా బాధ పెడతాయి. ఇందులోనూ ప్రైమరీ డిస్మెనోరియా, సెకండరీ డిస్మెనోరియా అని రెండు రకాలుంటాయి. మామూలుగా నెలసరిలో  వచ్చే నొప్పిని ప్రైమరీ డిస్మెనోరియా కింద లెక్కేస్తారు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. సెకండరీ డిస్మెనోరియాకి వచ్చే సరికి.. కొంతమందికి గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్, ఫైబ్రాయిడ్స్​, గడ్డలు ఉంటాయి. వీటివల్ల కూడా పిరియడ్స్​లో పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రైమరీ క్రాంప్స్​కి దారితీసే వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. 

ప్రైమరీ క్రాంప్స్​

సర్విక్స్: మామూలుగా గర్భసంచి లోపలి లేయర్​ నుంచి గర్భసంచి ముఖద్వారం( సర్విక్స్​) ద్వారా రుతుస్రావం బయటికొస్తుంది. అయితే కొంతమందిలో సర్విక్స్​ బాగా బిగుతుగా ఉంటుంది. దానివల్ల రుతుస్రావం తేలిగ్గా బయటికి రాలేదు. ఆ ఇబ్బంది వల్ల  బ్లీడింగ్​ అయ్యేటప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్లకి  నార్మల్​ డెలివరీ అయితే సర్విక్స్​ ఓపెన్​ అయ్యి సమస్య తగ్గిపోతుంది.

ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్: ప్రోస్టాగ్లాండిన్స్​ అనే హార్మోన్​ గర్భసంచి లోపలి పొర నుంచి ప్రతి నెలా రిలీజ్​ అవుతుంటుంది. ఇది కొందరిలో మామూలుగానే విడుదల అవుతుంది. కానీ, ఇంకొందరిలో మాత్రం ఎక్కువగా విడుదలై.. గర్భసంచి ముడుచుకుపోతుంది. ఈ హార్మోన్​ ప్రభావం గర్భాశయ కండరాలపైనే కాకుండా, మిగతా కొన్ని కండరాలపైన, అవయవాలపైన పడుతుంది. అందువల్ల ఆయా భాగాలకు రక్తప్రసరణ, ఆక్సిజన్‌‌ సరఫరా తగ్గిపోతాయి. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అది విడుదలయ్యే మోతాదును బట్టి  నెలసరిలో పొత్తికడుపు నొప్పి తీవ్రత ఉంటుంది. 

ఎండోమెట్రియం​​: గర్భసంచి లోపలి పొరని ఎండోమెట్రియం​ అంటారు. గర్భాశయాన్ని ప్రెగ్నెన్సీకి సిద్ధం చేయడానికి ఏర్పడే ఈ పొర ప్రతినెలా పిరియడ్స్​ టైంలో బ్లీడింగ్​ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ పొర నెలసరిలో మొత్తంగా విడిపోకుండా గర్భసంచిలోనే కొంచెం ఉండిపోతుంది. అక్కడ్నించి ఇతర శరీర భాగాలకెళ్లి అతుక్కుంటుంది. కొన్నిసార్లు ఫెలోపియన్​ ట్యూబ్స్​లోకి కూడా వెళ్తుంది. ఇదే ప్రైమరీ క్రాంప్స్​కి దారితీస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యకి కారణం శానిటరీ న్యాప్​కిన్స్ కూడా​. ప్లాస్టిక్​ కోటింగ్​​, ప్లాస్టిక్​ కవర్​​ ఉన్న శానిటరీ న్యాప్​కిన్స్​ డయాక్సిన్​ అనే కెమికల్స్​ని రిలీజ్​  చేస్తాయి. ఇవి గర్భాశయం అంతా వ్యాపించి ఎండోమెట్రియం​ సమస్యలకి దారితీస్తాయి. 
ముల్లేరియన్​ ఎనోమాలిస్​: అంటే గర్భసంచి డెవలప్​మెంట్​ సరిగా లేకపోవడం. కొంతమందికి రెండు గర్భ సంచిలు ఉంటాయి. ఇంకొందరికి గర్భ సంచి సగమే ఉంటుంది. ఫెలోపియన్​ ట్యూబ్స్​, సర్విక్స్​, వజైనా కూడా సరిగా డెవలప్​ అవ్వవు. ఇవన్నీ  కూడా పిరియడ్స్​ క్రాంప్స్​కి కారణాలే. వీటితో పాటు పిరియడ్​ని పోస్ట్​పోన్​ చేయడానికి కొందరు ట్యాబ్లెట్స్​ వాడుతుంటారు. దానివల్ల  పిరియడ్​ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అది కూడా నొప్పికి దారితీస్తుంది. 

ఏం చేయాలి?

కొందరికి  పిరియడ్​కి రెండురోజులు ముందు​ క్రాంప్స్​ మొదలవుతాయి. ముందుగా పొత్తికడుపులో మొదలై, కొన్ని గంటలు ఇబ్బంది పెడతాయి. లేదా ఆ నొప్పి రెండుమూడు రోజులు ఉంటుంది. పొత్తికడుపు, నడుము భాగాల నుంచి ఒక్కోసారి ఈ నొప్పి కాళ్లవరకూ పాకుతుంది. ఇంకొందరికి పిరియడ్​ వచ్చాక రెండు మూడు రోజులు నొప్పులు ఉంటాయి. అలాంటప్పుడు హాట్​ ప్యాక్​ పెట్టుకోవాలి. వేడినీళ్లతో స్నానం చేయాలి. మెనుస్ట్రువల్ థెరపీలు కూడా ఉన్నాయి. వాటిని ఫాలో అవడం మంచిది. అయితే కొందరు ఫలానా ఫుడ్​ తింటే పిరియడ్​ నొప్పి తగ్గుతుందని చెప్తుంటారు. వాటిని నిజమని చెప్పే ఆధారాలేం లేవు. కానీ, ప్రి– మెనుస్ట్రువల్​ సిండ్రోమ్​ ఉన్నవాళ్లు ఉప్పు తక్కువ తినాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్​ రిచ్​ ఫుడ్​ తీసుకుంటే మెనుస్ట్రువల్​ సైకిల్​ హెల్దీగా ఉంటుంది. ప్రొటీన్​ రిచ్​, కార్బో హైడ్రేట్​ తక్కువ ఉన్న ఫుడ్​ తీసుకోవాలి.  కెఫిన్​ డ్రింక్స్​, ఆల్కహాల్, స్మోకింగ్​కి దూరంగా ఉండాలి.  పిరియడ్​ని పోస్ట్​ పోన్​ చేయడానికి కొందరు మెడిసిన్స్​ వేసుకుంటుంటారు. అలాంటప్పుడు  క్లాట్స్​ ఎక్కువై.. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. క్రాంప్స్​  కూడా ఎక్కువ అవుతాయి. అందుకే వాటికి కూడా దూరంగా ఉండాలి. 

మానసికంగానూ ఇబ్బందులు

గర్భాశయంలో గడ్డలు, అండాశయంలో సిస్ట్‌‌లు ఉన్నప్పుడు  కూడా  పిరియడ్​ క్రాంప్స్​ ఎక్కువగా ఉంటాయి. అందుకే విపరీతమైన నొప్పి ఉంటే అది మామూలు నొప్పా? లేదా మరేదైనా సమస్య ఉందా? అనేది  తెలుసుకోవడానికి డాక్టర్​ని కలవాలి. అంతేకానీ, ఇది మామూలు విషయం అనుకుంటూ ఆ నొప్పిని భరించొద్దు. అలాగే కాటన్​తో తయారుచేసిన ఆర్గానిక్​​ న్యాప్​కిన్స్​ మాత్రమే వాడాలి.  విపరీతమైన నొప్పితో బాధపడేవాళ్లు మెడికల్ షాపులో ట్యాబ్లెట్స్​ కొని వాడుతుంటారు. అలా తరచూ వేసుకోకూడదు.  మెనుస్ట్రువల్​ హైజీన్​ మెయింటెయిన్​ చేయాలి. ప్రైవేట్​ పార్ట్స్​శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఆరు గంటలకోసారి ప్యాడ్​ మార్చుకోవాలి. ఈ టైంలో ఆడవాళ్లు శారీరకంగానే కాదు మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందుకే ఇంట్లోవాళ్లు వాళ్లని అర్థం చేసుకోవాలి.